టీడీపీ ప్రలోభపర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రత్యర్థి పార్టీ శ్రేణులను లాక్కోవడమే ధ్యేయంగా ఎంతకైనా బరి....
► కొనసాగుతున్న టీడీపీ ప్రలోభపర్వం
► రాయదుర్గం నియోజకవర్గంలో మితిమీరిన ఆగడాలు
అనంతపురం : టీడీపీ ప్రలోభపర్వానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రత్యర్థి పార్టీ శ్రేణులను లాక్కోవడమే ధ్యేయంగా ఎంతకైనా బరి తెగిస్తోంది. ‘పార్టీలోకి రండి.. పండుగ చేస్కోండి’ అన్న రీతిలో వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు రూ.కోట్లు కుమ్మరించి పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ నేతలు ఇప్పుడు కేడర్‌ను కూడా ప్రలోభపెడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో అయితే మరీ బరి తెగించారు. డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు టీడీపీలోకి వస్తే ఇసుకను కర్ణాటకలో విక్రయించేందుకు, ఇనుప ఖనిజం అక్రమ రవాణాకు తోడ్పడతామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.
గ్రామంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులను ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. గ్రామసమీపంలో ఉన్న ఇనుప గనుల్లో అక్రమంగా ఖనిజాన్ని తవ్వుకుని బీఐఓపీ పరిశ్రమకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు అవకాశం కల్పిస్తామని ఆశలు పెట్టారు. అలాగే బీఐఓపీలో ట్రాన్స్‌పోర్టును పార్టీలోకి వచ్చిన వారికే ఇచ్చేలా ఎస్కే మోదీ ( ఆ కంపెనీ ఎండీ)తో ఒప్పందం చేయిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ తరపున అభివృద్ధి పనులు ఇస్తామని, పనులు చేయకపోయినా బిల్లులు వచ్చేలా చూస్తామంటూ..ఇలా పలురకాలుగా ప్రలోభపెడుతున్నారు.