
ట్యాపింగ్‌కు ఆధారాల్లేవట
- అనుమానాలున్నాయని మాత్రమే కేంద్రానికి ఫిర్యాదు
- మీడియాలో వచ్చిన వార్తలే ఆధారాలుగా సమర్పణ
- ఫోన్ ట్యాపింగ్‌పై టీడీపీ సర్కారు తీరిది...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ ఢిల్లీకి వెళ్లి అందరినీ కలసి ఫిర్యాదు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ట్యాపింగ్‌పై ఆధారాలేవీ కేంద్రానికి సమర్పించలేదు. తామిచ్చిన ఫిర్యాదులో కూడా ట్యాపింగ్ జరిగిందన్న అనుమానాలున్నాయనే చెప్పి సరిపెట్టేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులిస్తూ రేవంత్‌రెడ్డి దొరికిపోయిన కేసులో బాబు ప్రమేయం ఉంద న్న ఆడియో టేపులు వెల్లడైన నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ వైపు మళ్లించిన విషయం తెలిసిందే.
తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలతోపాటు బలం లేనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేసిన వైనాన్ని పేర్కొన్నారు. ఒక టీడీపీ ఎమ్మెల్యేను బలవంతంగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లారని, పలు పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకొని కేసీఆర్ చట్టవ్యతిరేకచర్యలకు పాల్పడుతున్నారని వివరించారు.
విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్ విధుల నిర్వహణతో పాటు ఫోన్ల ట్యాపింగ్‌పైనా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై ఆధారాలే వీ సమర్పించలేదని ఒక సీనియర్ మంత్రి చెప్పారు. తమ మంత్రులు, ఇతరులకు సంబంధించి 120 ఫోన్లు ట్యాపింగ్ జరిగాయనడానికి తమ వద్ద ఆధారాలేవీ లేవని తెలిపారు.
స్టీఫెన్‌సన్‌తో బాబు జరిపిన బేరసారాల టేపులు తమ వద్ద ఉన్నాయని తెలంగాణ హోం మంత్రి నాయిని చేసిన వార్తలనే ఆధారాలుగా చూపి స్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు ఆ మంత్రి శుక్రవారం సచివాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఫోన్లు ట్యాప్ చేసే పరిజ్ఞానాన్ని చట్ట విరుద్ధంగా సమకూర్చుకున్న ప్రైవేటు సంస్థలకు ఔట్‌సోర్సింగ్ ఇచ్చి టీ సర్కార్ ట్యాపింగ్ చేసిందని బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకే మే 24 నుంచి 31 వరకు నామినేటెడ్ ఎమ్మెల్యే ఫోన్‌కు అంతరాయం కలిగించారని తెలిపారు.