నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం శనగలు పండించిన రైతులను ఆదుకోవటంలో ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తన విలాసాలు, విహారయాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పంటలు పండించిన రైతులకు మద్దతు ధరను ప్రకటించి వారిని ఆదుకునేందుకు ఏమాత్రం శ్రద్ధ చూపించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసరావుపేట మార్కెట్ యార్డులో ప్రభుత్వం తూతూ మంత్రంగా వారం రోజులపాటు మాత్రమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం నడిపి గత నెల 30వ తేదీతో ముగించిందన్నారు.
రైతులు ఈ క్రాప్, సర్టిఫికెట్ ఆఫ్ కల్టివేషన్ (సీవోసీ)లతో రిజిస్ట్రేషన్‌ల ద్వారా నమోదు చేసుకున్న పంటను కొనుగోలు చేయలేదన్నారు. రొంపిచర్ల మండలంలో 5200 ఎకరాల్లో శనగలు వేసి సీవోసీ తీసుకోగా, నరసరావుపేట మండలంలో 3400ఎకరాల్లో శనగలు వేశారన్నారు. మొత్తంగా 8600 ఎకరాల్లో పంటలు వేసినట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఎకరానికి కనీసంగా 8 క్వింటాళ్లు చొప్పున 68,800 క్వింటాళ్లు పండించారన్నారు. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా ఏప్రిల్ 30 వరకు నియోజకవర్గంలో కేవలం 3011 క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ప్రభుత్వం రూ.4450 మద్దతు ధర ప్రకటించగా బయట మార్కెట్‌లో రూ.3,200కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు.
పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవటంతో రైతులు బయటమార్కెట్‌లో విక్రయించటం ద్వారా క్వింటాలుకు కనీసంగా రూ.1250 కోల్పోవాల్సి వస్తోందన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి ఖర్చులను పరిశీలిస్తే వారికి మిగిలేది ఈ రూ.1250 మాత్రమే అన్నారు. రొంపిచర్లలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించి అందరివద్దా కొనుగోలు చేయకపోతే తాము చేసిన పోరాటం ద్వారా ప్రతి రైతు నుంచి కందులను కొనుగోలు చేశారన్నారు. వ్యవసాయంలో 16 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన శనగలు కొనుగోలు చేసేందుకు నిధులు కేటాయించి వారిని ఆదుకునేందుకు ఎందుకు ప్రయత్నించటం లేదని ప్రశ్నించారు.
ధర్మపోరాటానికి రూ.60 కోట్లు, విహార యాత్రలకు కోట్లాది రూపాయలు దుబారా ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి నివాసాలకు హైదరాబాదులో రూ.40 కోట్లు, విజయవాడలో వందల కోట్లు దుబారా చేశారన్నారు. ఇంత దుబారా చేస్తూ రైతులను ఆదుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రైతులు పండించిందే మెట్ట పైర్లు అయితే కనీస మద్దతు ధర రాకపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో నిండుగా నీరున్నా కనీసం రైతులకు ఒక పంటకైనా నీరివ్వకుండా గుడ్డిగా వ్యవహరించిందన్నారు.
కొంతమంది రైతులు ధైర్యంచేసి బావులు, చెరువుల కింద మాగాణి వరివేస్తే ఎకరాకు 50 బస్తాల వరకు ధాన్యం పండిందన్నారు. కనీసంగా ఆ నీరు ఇచ్చినా ప్రతి రైతు ఒక పంట వేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేవారన్నారు. వారిని మాగాణి వేసుకోనీయకుండా, వేసిన మెట్టపైర్లకు మద్దతు ధర రానీయకుండా చేయటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వెల్లడించారు. రైతులే మీడియా ముందుకు వచ్చి తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు కరువయ్యారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment