
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన హత్యాయత్నం ఘటన కేసును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. హైకోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చార్జ్‌షీట్ దాఖలు చేసే సమయం దగ్గరపడుతుండటంతో టీడీపీ ప్రభుత్వం ఈ కేసును నిలువరించేందుకు కుట్రలకు పాల్పడుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఎన్ఐఏకు ఇవ్వాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించినప్పటికీ వారిలో ఎలాంటి చలనం లేదు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు ఎన్‌ఐఏకు సహకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా ప్రకటించేసింది.
తాజాగా హత్యాయత్నం కేసు విచారణను ఆపాలంటూ ఎన్ఐఏ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హత్యాయత్నానికి సంబంధించిన కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున ఎన్‌ఐఏ విచారణ ఆపాలని పిటిషన్‌లో పేర్కొంది. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కావాలనే రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని న్యాయవాది వెంకటేశ్ శర్మ ఆరోపించారు. ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేస్తే.. అసలు కుట్ర దారులు బయటికొస్తారనే భయంతోనే కేసును అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ కుట్రలను న్యాయపరంగా ఎదుర్కొంటామని వెంకటేశ్ శర్మ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment