సర్కార్ షో
ఏలూరు : కొత్త ప్రభుత్వం కొలువుతీరి రెండు నెలలు కావస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావ డం.. పదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పాలనాపరంగా మా ర్పులుంటాయని, ప్రాధాన్యతా అంశా లు.. అభివృద్ధిపరంగా ఎంతోకొంత కొత్తదనం ఉంటుందని.. కొంతైనా దూ కుడు ఉంటుందని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేయూలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తీరా అందులో పొందుపర్చిన అంశాలను చూస్తే ‘పాత సీసాలో.. పాత సారాయే’ అన్నట్టుగా ఉంది. ప్రభుత్వ శాఖలు చేపట్టే రోజు వారీ పనులనే వంద రోజుల ప్రణాళికలో చొప్పిం చారు.
కొత్త పనులు చేపట్టడం మానేసి.. ప్రజలను మభ్యపెట్టేందుకు పాత పనులనే వంద రోజుల ప్రణాళికలో చేపడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అభివృద్ధి, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలేవీ వంద రోజుల ప్రణాళికలో కనిపించడం లేదు. కొత్తగా ఏవైనా పనులు చేర్చి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చూద్దామని అధికారులు అనుకుంటున్నా.. నిధులిచ్చే పరిస్థితి లేదని సర్కారు చేతులెత్తేస్తోంది. వ్యవసాయశాఖ, ఇరిగేషన్, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్ తదితర శాఖల్లోనూ వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు దీనిని కొనసాగించాలని పేర్కొంది. పాత వాటినే కొనసాగిస్తున్నా.. కొత్త ప్రణాళికను అమలు చేస్తున్నట్లుగా అధికారులు ప్రజలను భ్రమింప చేస్తున్నారు.
సీజనల్ పనులకూ ప్రణాళికలా
వంద రోజుల ప్రణాళికలో భాగంగా వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖల్లో సీజనల్ పనులే చేపడుతున్నారు. వర్షాకాల సీజన్‌లో చేపట్టే రోజువారీ పనులనే వంద రోజుల ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ సైతం మట్టి నమూనాల సేకరణ, విత్తనాలు, ఎరువుల పంపిణీ, షాపుల తనిఖీలు వంటి పాత పనులనే ఈ ప్రణాళికలో చేపడుతోంది. విద్యుత్ శాఖ సైతం తరచూ చేపట్టే విద్యుత్ లైన్ల మార్పిడి, ట్రాన్‌ఫార్మర్ల చుట్టూ రక్షణ గోడల నిర్మాణం వంటి పనులను వంద రోజుల కార్యక్రమంలో చేపడుతోంది.
ఇరిగేషన్‌లో సంకటం
నీటి పారుదల శాఖలోనూ 100 రోజుల ప్రణాళికను అమలు చేయడానికి అధికారులు నిర్ణయించారు. అయితే, గతేడాది అక్టోబర్‌లో మంజూరు చేసిన పనులను, ఇటీవల ప్రారంభించిన పనులను తక్షణమే నిలుపుదల చేయాలంటూ ఉత్తర్వులు వచ్చాయి. మరోవైపు మైనర్ ఇరిగేషన్ పనులు చివరి దశకు చేరాయి. ఈ పరిస్థితుల్లో పాత పనులైనా పూర్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. పోడోండ రిజర్వాయర్ పనులను మాత్రం ఈ వంద రోజుల్లో కాస్త ముందుకు నడిపించాలన్న యోచనలో యంత్రాంగం ఉంది.