ఓట్‌..అవుట్‌!  | TDP Government On Votes To Fake Survey Nellore | Sakshi
Sakshi News home page

ఓట్‌..అవుట్‌! 

Published Thu, Feb 28 2019 9:59 AM | Last Updated on Thu, Feb 28 2019 9:59 AM

TDP Government On Votes To Fake Survey Nellore - Sakshi

విచ్చలవిడి అవినీతి, అక్రమాలతో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల్లో అడ్డదారులు తొక్కైనా మళ్లీ గెలవాలనే లక్ష్యంతో పౌరుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది. గత ఎన్నికల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ ఈ దఫా ఓటమి తప్పదని భావించి కుట్రలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. రెవెన్యూ అధికారులు (ఎన్నికల అధికారులు) వద్ద ఉండాల్సిన ‘కీ’ తమ పార్టీ కార్యకర్తల చేతికిచ్చి క్షేత్రంలోకి సర్వేల పేరుతో పంపించి రెప్పపాటులో ఓట్లను తొలగించేస్తున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓట్లు తొలగించమని ఆన్‌లైన్‌ ద్వారా అధికంగా ఫారం–7 దరఖాస్తులు చేస్తున్నారు.

నెల్లూరు(పొగతోట): అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, వైఎస్సార్‌సీపీపై ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండడంతో టీడీపీ నేతలు భారీ సంఖ్యలో ఓట్లు తొలగించే  కుట్రకు క్షేత్రస్థాయిలో కుట్రలు పన్నుతున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన పేదలతో పాటు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను అడ్డదారిలో తొలగిస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ ఓట్ల చేర్పులు, మార్పుల కోసం ఇచ్చిన అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా ఓట్లు తొలగించమని 10 వేల ఫారం–7 దరఖాస్తులు వచ్చాయి. సుమారు 3 వేల ఫారం–7 దరఖాస్తులు బీఎల్‌ఓలకు అందజేశారు.

కావలి నియోజకవర్గంలో 3,800, ఆత్మకూరులో 2,900 ఫారం–7 దరఖాస్తులు ఆన్‌లైన్‌ ద్వారా అధికంగా వచ్చాయి. అధికార పార్టీ బోగస్‌ ఏజెంట్లను నియమించి వారి ద్వారా ఓట్లు తొలగించేలా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేయిస్తున్నారు. చదువుకున్న వారు ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవకాశం ఉంది. చదువు రాని పేద ప్రజలు గుర్తింపు కార్డు ఉందని, ఓటు ఉంటుందనే ఆలోచనతో ఉంటారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పేద వర్గాలకు మేలు చేకూర్చే విధంగా ఆ పార్టీ ప్రణాళికలు ప్రకటించడంతో నిరక్షరాస్యులు, పేదలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారనే భయంతో ఆయా వర్గాల ఓట్లు తొలగించేలా అధికార పార్టీ కుటిలయత్నాలు చేస్తోంది.

అధికార పార్టీకి తొత్తుల్లా అధికారులు
అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలకు అధికారులకు సహకారం అందించడంతో ఓట్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా జరిగిపోతుంది. జిల్లా జనాభా 32 లక్షలకు పైగా ఉన్నారు. సుమారు 8.50 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి మూడు ఓట్ల చొప్పున వేసుకున్న జిల్లాలో 25.50 లక్షల ఓట్లు ఉండాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఓటర్ల సంఖ్య 22,06,652 మాత్రమే ఉన్నాయి. 2015లో 22,78,313 మంది ఓటర్లు ఉంటే.. ప్రస్తుతం అధికారులు ప్రకటించిన జాబితాలను పరిశీలిస్తే 71,661 ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఆ ప్రకారం పరిశీలిస్తే ఓటర్ల శాతం తక్కువగా ఉంది. ఒక పక్క  ఓట్ల సంఖ్య పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది.

అర్హులైన వయోజనులు, 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరూ ఓటు హక్కుకు దరఖాస్తులు చేసుకోమని ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు నమోదుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియను అవకాశంగా తీసుకుని టీడీపీ జిల్లాలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీరు నిత్యం ప్రజలతో ఉంటూ వారి వివరాలు సేకరిçస్తూ ఓట్లు తొలగించేలా ఫారం–7ను ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా వారికి సహకరిస్తున్నారు.

ఓట్లు కొల్లగొడుతున్న టీడీపీ సైబర్‌ దొంగలు
క్షేత్రస్థాయిలో కొన్ని బృందాలు ఇలా తిరిగి ఓట్లు గల్లంతు చేస్తుంటే.. ఇంకొన్ని టీడీపీ సైబర్‌ దొంగలు బృందాలుగా ఐవీఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ప్రక్రియ ద్వారా ఓట్లు కొల్లగొట్టుతున్నారు. రాజధాని అమరావతి నుంచి ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌ ఫోన్లు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన బాగుంటే 1 నొక్కండి.. లేదంటే 2 నొక్కండని వాయిస్‌ వినిపిస్తున్నారు. రెండు నంబర్‌ నొక్కిన వారి చిరునామా, డోర్‌ నంబర్లు సేకరించి ఓట్లు గల్లంతు చేస్తున్నారు. ఓట్లు తొలగిస్తున్నారనే సమాచారం బయటకు రావడంతో ఓటు పోతుందనే భయంతో కొందరు 1 నొక్కుతున్నామని చెబుతుండడం విశేషం.

ఇలా జరగాలి.. కానీ ఇలా చేస్తున్నారు..
ఓట్ల చెర్పులు, తొలగింపుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్లకు పంపుతారు. వాటిని డేటా ఎంట్రీ చేయాలి. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు పరిశీలించి అర్హులు అయితే ఓటు హక్కు కల్పిస్తారు. తొలగింపు దరఖాస్తులు వస్తే.. వాటిని కొన్ని స్థాయిల్లో పరిశీలించి ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తారు. ఇటువంటి ప్రక్రియ చేయకుండానే ఓట్లు తొలగిస్తున్నారు. విషయం తెలియని వారు ఓటు ఉందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు అడిగితే అధికారులు లేదని సమాధానం ఇస్తారు. ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి ఇంత వరకు ఓటు ఇవ్వలేదు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement