సాక్షి, అమరావతి: గతంలో ఏ సర్కారు హయాంలోనూ జరగని విధంగా టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సైతం ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితులను మాజీ సీఎం చంద్రబాబు కల్పించారు. అంతేకాదు.. ఉద్యోగుల కష్టార్జితాన్ని కూడా చంద్రబాబు సర్కారు వాడుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం నిర్వహించిన సమీక్షలో నివ్వెరపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇతర అవసరాల కోసం జీపీఎఫ్ డబ్బులు ..
ఉద్యోగులు ప్రతి నెలా వారి వేతనాల్లో కొంత మొత్తాన్ని భవిష్యనిధికి (జీపీఎఫ్) జమ చేస్తారు. ఉద్యోగులు తమ అత్యవసరాల కోసం లేదా పదవీ విరమణ అనంతరం ఆ నిధినుంచి డబ్బులు తీసుకుంటారు. అయితే చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీపీఎఫ్ నిధి నుంచి ఏకంగా రూ.66,108 కోట్లను ఇతర అవసరాలకు విచ్చలవిడిగా వినియోగించేసింది. జీపీఎఫ్ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఇతర అవసరాలకు వినియోగించుకోవడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. జీపీఎఫ్ నిధి నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్నట్లు తేలింది. దీన్ని తిరిగి జీపీఎఫ్ నిధికి జమ చేయాల్సి ఉంటుంది.
చేతులెత్తేసిన పౌరసరఫరాల సంస్థ
మరోవైపు వివిధ కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వ గ్యారెంటీతో తీసుకున్న అప్పులను వాటి అవసరాల కోసం వినియోగించుకోనివ్వకుండా చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలకు వినియోగించడం పట్ల విస్తుపోతున్నారు. కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పులను ఎన్నికల ముందు పసుపు కుంకుమ తదితర రాజకీయ ప్రయోజనాల పథకాల కోసం వాడుకోవటంపై నివ్వెరపోతున్నారు. చంద్రబాబు పాలనలో రాజకీయ అవసరాల కోసం కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను వాడుకోవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం ఆయా కార్పొరేషన్లకు బకాయి పడింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల కార్పొరేషన్ తీసుకున్న రూ.4,800 కోట్ల అప్పును చంద్రబాబు సర్కారు ఎన్నికల తాయిలాలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులకు మళ్లించేసింది. దీంతో పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేయలేక చేతులెత్తేసింది. రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా ఇవ్వలేకపోతోంది.
ఇళ్ల నిధులు గుల్ల
గృహ నిర్మాణ అభివృద్ధి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.400 కోట్లను కూడా బాబు సర్కారు ఇతర అవసరాల కోసం వినియోగించేసింది. దీంతో పేదల ఇళ్లకు సంబంధించిన బిల్లులు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ మంచినీటి కార్పొరేషన్ పేరుతో తీసుకున్న రూ.900 కోట్లను కూడా టీడీపీ సర్కారు దారి మళ్లించడంతో మంచినీటి పనుల బిల్లులు ఆగిపోయాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు నిర్వీర్యం చేసినట్లు శనివారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో వెల్లడైంది. ఉద్యోగులకు చెల్లించాల్సిన జీపీఎఫ్ అప్పుతో కలిపి టీడీపీ పాలనలో చేసిన అప్పులు (కార్పొరేషన్‌ల పేరుతో తీసుకున్న అప్పులు మినహా) 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.2,58,928 కోట్లకు చేరుకున్నాయి.
ఉద్యోగుల కష్టార్జితం ఉఫ్!
Published Sun, Jun 2 2019 4:10 AM | Last Updated on Sun, Jun 2 2019 2:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment