తేలని పితలాటకం
పట్టువీడని మంత్రులు బీసీ అయితే కాశీ విశ్వనాథం!?
ఎస్టీ అయితే ఎం.వి.ఎస్.{పసాద్‌లకు ఛాన్స్!?
నిర్ణయం నేటికి వాయిదాటీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిఎంపిక వ్యవహారం
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పితలాటకం మరింత జఠిలంగా తయారైంది. జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి పప్పల చలపతిరావు పేరును ఇప్పటికే ఖరారు చేశారు. కాగా రెండో ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక మాత్రం టీడీపీలో వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారింది. సామాజికవర్గ సమీకరణలతోపాటు వర్గ రాజకీయాల పీటముడి బిగుసుకుంది. రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన సమావేశం తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మంత్రులు ఇద్దరు తమ మాటే నెగ్గాలని పంతం పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో శుక్రవారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సీఎం చంద్రబాబు చెప్పారు.
విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో మంత్రులు గంటా, అయ్యన్నలతోపాటు జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న తమకు అవకాశం కల్పించాలని విడివిడిగా కోరారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు రామానాయుడు, పీలా శ్రీనివాస్, బొడ్డేటి కాశీవిశ్వనాథం, అనకాపల్లికిచెందిన డాక్టర్ సరస్వతి తదితరులు తమకు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఓసీ వర్గానికి చెందిన పప్పల చలపతిరావుకు కేటాయించినందున రెండో స్థానాన్ని బీసీకిగానీ ఎస్టీకిగానీ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దాంతో కన్నబాబు రాజుకు అవకాశాలు మూసుకుపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినందున ఎమ్మెల్సీగా అవకాశమివ్వలేనని రామానాయుడుకు సీఎం చెప్పేశారు. దాంతో అయ్నన్నపాత్రుడు బీసీ వర్గం నుంచి పీలా శ్రీనివాస్ పేరును ప్రతిపాదించారు. కాగా గంటా శ్రీనివాసరావు మాత్రం బీసీ వర్గానికే చెందిన కాశీ విశ్వనాథంకు అవకాశమివ్వాలని పట్టుబట్టారు. ఈమేరకు ఇద్దరు మంత్రులు కూడా సీఎంతో విడిగా మాట్లాడుతూ తమ వాదనను బలంగా వినిపించారు. దాంతో సీఎం ఏమీ తేల్చకుండా శుక్రవారం మరోసారి చర్చించిన అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేద్దామని చెప్పి అందర్నీ పంపించి వేశారు.
ఎస్టీ అయితే ఎం.వి.ఎస్. ప్రసాద్!?
తాజా పరిస్థితుల నేపథ్యంలో రెండో ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. బీసీకే ఇవ్వాలని భావిస్తే కాశీ విశ్వనాథంకు అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పప్పల చలపతిరావు మంత్రి అయ్యన్నకు సన్నిహితుడు. మరోవైపు అయ్యన్న ప్రతిపాదిస్తున్న పీలా శ్రీనివాస్ సోదరుడు గోవింద సత్యన్నారాయణ అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రెండో అభ్యర్థిగా మంత్రి గంటాతోపాటు మెజార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్న కాశీ విశ్వనాథంకు అవకాశాలు మెరుగయ్యాయి. కానీ చంద్రబాబు మాత్రం ఎస్టీ నేతను ఎంపిక చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం మాజీ మంత్రి మణికుమారి, మాజీ ఎమ్మెల్యే ఎం.వి.సత్యన్నారాయణ కుమారుడు ఎం.వి.ప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నారు. మణికుమారి కంటే యువకుడైన ఎం.వి.ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీకి ఇవ్వాలని నిర్ణయిస్తే కాశీ విశ్వనాథంను, ఎస్టీకి ఇవ్వాలని భావిస్తే ఎం.వి.ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. అనూహ్య మార్పులు జరిగితే తప్పా వీరిద్దరిలో ఒకరికి అవకాశం లభించొచ్చని టీడీపీవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో శుక్రవారం మరోసారి సమావేశమై చంద్రబాబు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు.