నీకు దమ్ముంటే కడపలో రాజకీయాలు చేయి | TDP Leader Nandyala Varada Rajulu Reddy Fire On CM Ramesh YSR Kadapa | Sakshi
Sakshi News home page

నీకు దమ్ముంటే కడపలో రాజకీయాలు చేయి

Published Tue, Jul 31 2018 9:27 AM | Last Updated on Fri, Aug 10 2018 5:04 PM

TDP Leader Nandyala Varada Rajulu Reddy Fire On CM Ramesh YSR Kadapa - Sakshi

మాట్లాడుతున్న టీడీపీ నేత వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు టౌన్‌(వైఎస్సార్‌కడప): ఎంపీ సీఎం రమేష్‌పై  టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రొద్టుటూరులోని నెహ్రూ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీ రమేష్‌  గుంపులను తయారు చేసుకుని వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం రమేష్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేసిన విషయం బయటపడుతుందన్నారు.

దమ్ము, ధైర్యముంటే కడప, పులివెందుల మున్సిపాలిటీల్లో రాజకీయాలు చేయాలని సవాల్‌ విసిరారు. గతంలో చెప్పినట్లు గ్రామ రాజకీయాలకు ఎక్కువ, మండల రాజకీయాలకు తక్కువ అన్నారు. దమ్ముంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి తన సత్తాను చాటుకోవాలన్నారు.  మున్సిపాలిటీలో రాజకీయాలు చేసేందుకు తాము అంగీకరించమని, సీఎం రమేష్‌ నాయకత్వాన్ని ఎవరూ కోరుకోవడం లేదని చెప్పారు. వరదరాజులరెడ్డి, సీఎం రమేష్‌ పరిస్థితి ఏమిటో సీఎం చంద్రబాబుకు కూడా తెలుసునన్నారు.

సీఎంకు మరో మారు ఫిర్యాదు
ప్రొద్దుటూరు వ్యవçహారంపై సీఎంకు మరో మారు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తన వర్గీయులతో సమావేశం పెట్టి మున్సిపల్‌ చైర్మన్‌కు తెలపలేదన్నారు. రూ.80 కోట్లు ఖర్చు పెట్టాలంటే నిబంధనల ప్రకారం చేయాలన్నారు. 40 మంది కౌన్సిలర్లలో 22 మంది కౌన్సిలర్లను తాను డబ్బు పెట్టి గెలిపించానన్నారు. ఇప్పుడు నీవు డబ్బు పెట్టి కొందరిని నీ పక్కకు తిప్పుకున్నావని, తన వద్ద డబ్బు ఉంటే మరో 10 మంది కౌన్సిలర్లను కొనేవాడనన్నారు.

తాను ఇచ్చిన డబ్బు పాతపడిపోయింది కాబట్టి నీ వద్దకు వచ్చారన్నారు. తనకు ఎంత చెడ్డపేరు తేవాలని నీవు ప్రయత్నించినా అవి ఫలించవన్నారు. ముఖ్యమంత్రి దయాదాక్షిణ్యాల వల్ల నీకు రెండో సారి రాజ్యసభ సీటు దక్కిందన్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, రాజంపేట, అన్ని చోట్ల రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఎంపీ రమేష్‌ తమ్ముడును నిలపాలని ఉన్నారని, అతనికి కూడా మా సహకారం కావాలి కదా అని అన్నారు. పార్టీలో ఎవరికి సీటు ఇచ్చినా తలవంచి పనిచేస్తామన్నారు. వేల కోట్లు అక్రమార్జన చేసి ఫ్‌లైట్లల్లో తిరిగితే ప్రజలెవ్వరు నమ్మరన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement