తెలుగు‘తమ్ముళ్ల’ బరి తెగింపు
అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుతమ్ముళ్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఆ పార్టీ ముఖ్యనేతల ఏకపక్ష విధానాలతో విసుగెత్తి, తునిలో వారికి దూరమైన నేతలను లక్ష్యంగా చేసుకుని భౌతికదాడులకు తెగబడుతున్నారు. ముఖ్యనేతల కనుసన్నల్లో ద్వితీయ శ్రేణి బరి తెగిస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. బాధితులు తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెట్టినా టీడీపీ నేతలపై ఫిర్యాదులు తీసుకోవడానికే జడిసిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తెలుగుదేశం గద్దెనెక్కాక.. గత ఆరు నెల లలో జరిగిన వరుస ఘటనలను పరిశీలిస్తే తుని లో ఆ పార్టీ ఆగడం స్పష్టవుతుంది. వారి దాడు ల్లో బాధితులంతా ఒకప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అతనికి వరుసకు సోదరుడైన కృష్ణుడి ముఖ్య అనుచరులే కావడం గమనార్హం. సుమారు మూడు దశాబ్దాలు తుని నియోజకవర్గాన్ని రామకృష్ణుడు ఒంటిచేత్తో నడిపించారు. ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఇటీవలనే ప్రకటించిన కృష్ణుడు అన్న కనుసన్నల్లో అన్నింటా తానై చక్రం తిప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2009లో రామకృష్ణుడిని, 2014లో కృష్ణుడిని ఓడించారు.
జనం తీర్పును జీర్ణించుకోలేక..
ప్రజల తీర్పును జీర్ణించుకోలేని తెలుగు‘తమ్ముళ్లు’.. పార్టీని వీడి తమ ఓటమికి కారణమైన నేతలే లక్ష్యంగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. గత ఆరునెలల్లో అనేక దాడులు జరగగా, తాజాగా ఆదివారం తొండంగి మండల వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మత్స్యకార సంఘం డెరైక్టర్ కోడా వెంకటరమణపై టీడీపీ వర్గీయులు మారణాయుధాలతో దాడులకు తెగబడ్డ సంఘటన ఆ పార్టీ నాయకుల వైఖరిని స్పష్టం చేస్తోంది. పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న వెంకటరమణపై జి.ముసలయ్యపేట, కొత్తముసలయ్యపేటల టీడీపీ నాయకులు తాటిపర్తి దండియ్య, నేమాల సత్తిబాబు, తాటిపర్తి బాబూరావు, తాటిపర్తి యతిమాని పట్టపగలు స్థానికులు వారించినా మారణాయుధాలతో దాడి చేశారు.
ప్రాణభయంతో పరుగు తీసి స్పహతప్పిపడిపోయిన వెంకటరమణ అనంతరం ఒంటిమామిడి పోలీసు స్టేషన్‌లో ఉదయం ఫిర్యాదుచేశారు. అయితే ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో సాయంత్రం వరకు కేసు నమో దు చేయకుండా పోలీసులు వెనుకాడారు. బాధితుడికి వైఎస్సార్ సీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అండగా నిలవడంతో గత్యం తరం లేక పోలీ సులు కేసు నమోదు చేశారు. వెంకటరమణ గతంలోనే కృష్ణుడి నుంచి ప్రాణహాని ఉందంటూ జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఒకప్పుడు యనమలకు వెన్నంటి నిలిచిన మత్స్యకార వర్గంలో కొంతమంది మాత్రమే ఇప్పుడు వారి వెంట ఉన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సోదరుల వెంట ఉన్న వారు కూడా బయటకు వచ్చేసి ఒంటిమామిడి పోలీసు స్టేషన్ వద్ద కృష్ణుడు, అతని అనుచరులపై కేసు నమోదు చేసే వరకు ఆందోళనకు దిగారు.
ఆగడాలు ఎన్నో..
దానవాయిపేటలో తమ వసూళ్లకు సహకరించని ప్రియాంకా హేచరీస్ అధినేత చంద్రమౌళిపై దాడులకు తెగబడ్డ సంఘటన రాష్ట్రస్థాయిలో టీడీపీలోనే తీవ్ర సంచనలమైంది. ఆ ఘటనకు కృష్ణుడే కారకుడని హేచరీ అధినేత పోలీసులకు ఫిర్యాదుచేసినా కేసు నమోదులో తాత్సారంతో చివరికి వ్యవహారం పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది.
తొండంగి మండలం శృంగవృక్షంలో మానం సోమేశ్వరరావుపై సర్పంచ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కేసు బనాయింపు.
బూర పెత్తందారు, మానం తాతారావు, పులి ఏసు, పులుగు సుబ్బారావులపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి వేధింపులు.
తొండంగి మండలం కొమ్మనాపల్లిలో సెక్రటరీని దూషించినట్టు ఉప సర్పంచ్ భర్త కోన రాంబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు. బెయిల్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డంకి
తొండంగి మండలం యల్లయ్యపేటలో యజ్జల రాజు, అతని చెల్లిపై దాడి చేసి తిరిగి అక్రమ కేసు బనాయింపు.
తుని మండలం కొలిమేరుకు చెందిన సాధు అప్పారావుపై దాడి..
కె.ఒ.మల్లవరంలో అన్నంరెడ్డి వీర్రాఘవులు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్‌లపై అక్రమ కేసుల బనాయింపు. పొలం నుంచి ఫలసాయం తేనివ్వకుండ అధికారుల ద్వారా వేధింపులు.
బిళ్లనందూరులో బి.రాంబాబు, వరహాలు, చిన్న, బోత్స సత్తిబాబులపై అక్రమ కేసులు
ప్రజల తిరస్కరించారన్న అక్కసుతో రా జకీయ ప్రత్యర్థులపై ఇలా దాడులకు దిగిన వా రిని చరిత్ర క్షమించదని, ఫలితం అనుభవించక తప్పదని తెలుగుతమ్ముళ్లు గుర్తించాలి.