
టీడీపీ పదవులపై నేతల కన్ను
తెలుగుదేశం పార్టీ నేతల కళ్లన్నీ పార్టీ పదవులపైనే ఉన్నాయి. ప్రస్తుతం అర్బన్, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది.
అర్బన్, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు
సీనియర్లకు మొండి చెయ్యి?
సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట
విజయవాడ : తెలుగుదేశం పార్టీ నేతల కళ్లన్నీ పార్టీ పదవులపైనే ఉన్నాయి. ప్రస్తుతం అర్బన్, జిల్లా కమిటీల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. రాష్ట్ర నూతన రాజధానిగా విజయవాడ కీలకం కావడంతో పార్టీ పదవులను దక్కించుకుంటే.. విజిటింగ్ కార్డు చూపించైనా అధికారులతో పనులు చేయించుకోవచ్చని భావిస్తున్న కొంతమంది నేతలు తమ బెర్త్‌ల కోసం పోటీపడుతున్నారు. కమిటీల ఏర్పాటుపై ముఖ్య నేతలు ఇప్పటికే కొంత కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. అర్బన్ అధ్యక్షుడిగా బుద్ధా.. కార్యదర్శిగా పట్టాభి! టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్ననే తిరిగి కొనసాగించాలని నేతలు భావిస్తున్నారు. వివాదరహితుడు కావడంతో పాటు ముఖ్యనేతలకు అనుకూలంగా ఉండటంతో ఆయన్నే కొనసాగించాలని యోచిస్తున్నారు.
గతంలో కార్యదర్శి పదవులను తూర్పు నియోజకవర్గం నుంచి ఎస్సీ (మాదిగ)కు చెందిన సొంగా రవీంద్రవర్మకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎస్సీ(మాల)కు చెందిన కొట్టేటి హనుమంతరావుకు, సెంట్రల్‌నియోజకవర్గం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన గోగుల రమణారావుకు ఇచ్చారు. ఇప్పుడు వారు ముగ్గురినీ పక్కన పెట్టి చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌కు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎస్సీలను పక్కన పెట్టడం పై ఆవర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు. వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు వారికి చెందిన కల్యాణ మండపాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంతో ఆ వర్గం ప్రజలు టీడీపీ అంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీలో మరో కీలకమైన తెలుగుయువత పోస్టుకు కాట్రగడ్డ శ్రీనును ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనదీ చంద్రబాబు సామాజిక వర్గమే. అదే వర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్.ఉషారాణిని కొనసాగించాలని భావిస్తున్నారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా పార్టీలో సీనియర్ నేత పరిశపోగు రాజేష్(లాజరస్)ను పక్కన పెట్టి గత ఎన్నికలకు ముందు సీపీఎం నుంచి టీడీపీలోకి తీసుకొచ్చిన నరసింహారావును నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీలోని సీనియర్లు అందరినీ పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి, చంద్రబాబు సొంత సామాజికవర్గానికి పెద్ద పీట వేయడం పై ఇతర సామాజికవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంపీలు, మంత్రి, మేయర్, జెడ్పీ చైర్మన్ వంటి కీలక పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే ఇచ్చారని, ఇప్పుడు అర్బన్ పార్టీలోని కీలక పదవులకూ వారినే ఎంపిక చేసేందుకు ప్రయత్నించడమేమిటని ఇతర సామాజిక వర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో అర్జునుడు, బుల్లయ్య మధ్య పోటీ!
జిల్లా అధ్యక్ష పదవికి బచ్చుల అర్జునుడు, ఎంపీ కొనగళ్ల నారాయణ సోదరుడు బుల్లయ్య మధ్య పోటీ నెలకొంది. బచ్చుల అర్జునుడికి జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నిస్తుండగా, బుల్లయ్యకు ఆ పదవి దక్కేందుకు కొనగళ్ల నారాయణ, మంత్రి కొల్లురవీంద్ర, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, బొడే ప్రసాద్ తదితరులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే కేంద్ర మంత్రి సుజనాచౌదరి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి ఆయన ద్వారా చంద్రబాబుకు చెప్పించి బుల్లయ్యకు జిల్లా అధ్యక్ష పదవిని దక్కేలాగా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా బుల్లయ్యకు అధ్యక్షపదవి ఇస్తే తనకే కావాలని పట్టుబట్టకూడదనే ఆలోచనలో అర్జునుడు ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే టికెట్, అధ్యక్ష పదవి ఇవ్వనందున ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరాలని అర్జునుడు యోచిస్తున్నారని సమాచారం.