నరసాపురంలో దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ నేతలు
కాశినాయన: మండల కేంద్రమైన నరసాపురంలో జరిగిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నేతలు దౌర్జన్యానికిపాల్పడ్డారు. నరసాపురం పంచాయతీలో నరసాపురం, మిద్దెల, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామాలు ఉన్నాయి. అందరికీ అనువుగా ఉండటంతో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో సచివాలయ భవనం నిర్మించాలని, శుక్రవారం శంకుస్థాపన చేయాలని అధికారులు నిర్ణయించారు. కానీ సచివాలయం తమ గ్రామంలోనే నిర్మించాలని టీడీపీ నాయకులు అనిల్ ఉరఫ్ వెంకటరెడ్డి, సుబ్బారెడ్డి, నాగలక్షుమ్మ తదితరులు తమ అనుచరులతో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిని గ్రామంలో అడ్డుకుని హాల్‌చల్ సృష్టించారు. తాము చెప్పిన చోటే సచివాలయం నిర్మించాలంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు.
వైఎస్సార్‌సీపీ మండల కనీ్వనర్ విశ్వనాథరెడ్డి, ఎంపీడీఓ ముజఫర్ రహీం, తహశీల్దార్ శ్రీనివాసులు టెంకాయకొట్టి శంకుస్థాపన చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి వచ్చి అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతలను దుర్భాషలాడారు. సామగ్రిని చిందరవందర చేసి హంగామా సృష్టించారు. పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పినా టీడీపీ నాయకులు మాత్రం అక్కడి నుంచి కదల్లేదు. చివరకు వారిపై కూడా రుబాబు చేశారు. రెండు గంటల అనంతరం వారు వెనుదిరిగారు. అందరికీ అనువైన ప్రాంతంలో సచివాలయం నిర్మిస్తుంటే అడ్డుకోవడంపై మిద్దెల, నరసాపురం, మూలపల్లె, నరసన్నపల్లె గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఓబులాపురంలో....
మండలంలోని రంపాడు పంచాయతీ సచివాలయ భవ భవనానికి ఓబులాపురం వద్ద శుక్రవారం స్థానిక నాయకులు రాజనారాయణరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాజారెడ్డిల ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన నాయకులు హాజరయ్యారు. రంపాడులోనే సచివాలయం నిర్మించాలని కొంతకాలంగా ప్రజలు కోరుతున్నారు. రంపాడుతో పాటు పిట్టికుంట, ఓబులాపురం, ఉప్పలూరు పంచాయతీలోని ప్రజలకు అనువుగా ఉన్న ఓబులాపురం వద్ద నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం శంకుస్థాపన తలపెట్టారు. తొలుత కార్యక్రమానికి వస్తున్న ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో స్థానిక నేతలే భూమిపూజ చేసుకోవాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment