
సాక్షి, వెదురుకుప్పం: వంక పోరంబోకులో అక్రమ నిర్మాణాన్ని తొలగించారన్న కక్షతో చిత్తూరు జిల్లాలో కొందరు అధికారపార్టీ నాయకులు దళితులపై దౌర్జన్యం చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెదురుకుప్పం మండలం బొమ్మయ్యపల్లె పంచాయతీ జడబాపనపల్లె ఆది ఆంధ్రవాడలో ఈ దారుణం జరిగింది. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
యూకేమర్రిçపల్లెకు చెందిన మండల టీడీపీ ఉపాధ్యక్షుడు వెంకట్రామనాయుడికి.. జడబాపనపల్లె దళితులకు గతంలో దారి సమస్యపై విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే జడబాపనపల్లెకి చెందిన టీడీపీ కార్యకర్త మణితో పాటు కొందరు వంక పోరంబోకులో షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. దీంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు వెళ్లి షెడ్డుతో పాటు మరుగుదొడ్లను తొలగించారు.
ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మునిరాజ ఇంటి వెనుక భాగంలో స్నానం చేసుకోవడం కోసం తడికెలతో చిన్నిపాటి గదిని ఏర్పాటు చేసుకున్నాడు. దీన్ని సాకుగా తీసుకున్న మర్రెపల్లె గ్రామానికి చెందిన టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వెంకట్రామనాయుడు, అతని అనుచరులు మణితో జతకలిసి బుధవారం ఉదయం దాడి చేశారు. ఇళ్లలో ఉన్న వారిని బయటకు లాక్కొచ్చారు. దీంతో భయంతో దళితులు పరుగులు తీశారు. ఈ దాడిలో పురుషోత్తం(29), వెంకటస్వామి(59), సుబ్రమణ్యం(60) తీవ్రంగా గాయపడ్డారు. భయంతో 100కు సమాచారం ఇచ్చారు. దీంతో కార్వేటినగరం సీఐ చల్లనిదొర, వెదురుకుప్పం ఎస్‌ఐ రామకృష్ణ జడబాపనపల్లె గ్రామానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు.