బాధితులను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కర్నూలు, బనగానపల్లె రూరల్: అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. అవినీతి అక్రమాలను ప్రశ్నించిన వారిపై ఇనుప రాడ్లు, కర్రలతో విరుచుకు పడ్డారు. వారి దాడిలో వైఎస్సార్‌సీపీ వర్గీయులు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఘటనా వివరాలను బాధితుడు పెద్ద వెంకటరెడ్డి వెల్లడించాడు. వాటర్‌షెడ్డు పనుల పరిశీలన నిమిత్తం ఈ నెల 26న తనిఖీ బృందం గ్రామంలో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ పెద్ద వెంకటరెడ్డి ఫాంపాండ్ నిర్మాణాల్లో జరిగిన అక్రమలపై అధికారులను ప్రశ్నించారు. దీంతో జీర్ణించుకోలేని టీడీపీకి చెందిన గడ్డం నాగేశ్వరెడ్డి, చెన్నారెడ్డి మరికొంత మంది.. అధికారుల ముందే పెద్ద వెంకటరెడ్డిని దూషించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలకు అధికారులు సర్ధిచెప్పడంతో శాంతించారు. అక్రమాలను ప్రశ్నించిన విషయం మనుసులో పెట్టుకున్న టీడీపీ వర్గీయులు గడ్డం నాగేశ్వరరెడ్డి, చెన్నారెడ్డి, సురేంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి గురువారం ఉదయం పెద్ద వెంకటరెడ్డి బంధువు చిన్ననాగేశ్వరరెడ్డిపై దాడికి యత్నించగా ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి దాడులను ఆపేందుకు ప్రయత్నించిన పెద్ద వెంకటరెడ్డితో పాటు అతడి కుటుంబ సభ్యులు శ్రీనివాసరెడ్డి, చిన్ననాగేశ్వరరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, పెద్దనాగేశ్వరరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నాగేశ్వరమ్మ, ప్రవీణ్‌లపై టీడీపీ వర్గీయులు విరుచుకుపడ్డారు. విచక్షణ రహితంగా రాడ్లు, కర్రలతో కొట్టడంతో నలుగురు తీవ్రంగా గాయ పడగా మరో నలుగురికి రక్త గాయాలయ్యాయి.
ఇరువర్గాలపై కేసు నమోదు
దాడి విషయంలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు పాణ్యం సీఐ వాసుకృష్ణ, నందివర్గం ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో వాటర్‌షెడ్డు పనుల్లో జరిగిన అక్రమాలపై బుధవారం జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్ద వెంకటరెడ్డి వర్గానికి చెందిన 10మందిపై, టీడీపీ నాయకుడు గడ్డం నాగేశ్వరరెడ్డి వర్గానికి చెందిన ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్ ఏర్పాటు చేశామన్నారు.
రాజకీయంగా ఎదుగుదల చూసి ఓర్వలేకనే దాడి: మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడి ఘటనను పార్టీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నియోజకవర్గ నేత యర్రబోతుల వెంకటరెడ్డి ఖండించారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ నాయకుడు పెద్దవెంకటరెడ్డి రాజకీయంగా ఎదుగుండడంతోనే ఓర్వలేక టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారన్నారు. నిందితులను కాపాడేందుకు నాయకులపై ఒత్తిడి తెచ్చి కౌంటర్ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితులకు న్యాయం జరగకపోతే పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా దిగుతామని హెచ్చరించారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీఆర్ వెంకటేశ్వరరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్దంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, నాయకులు కాటసాని ప్రసాదరెడ్డి, కాటసాని తిరుపాల్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అబ్దుల్‌ఖైర్, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, వెంకటేశ్వరెడ్డిచ కిశోర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment