నడిరోడ్డుపై కర్రలతో టీడీపీ నేత దాదాగిరి.. | tdp leaders dadagiri in vijayawada | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపై కర్రలతో టీడీపీ నేత దాదాగిరి..

Published Sun, Jun 24 2018 10:17 AM | Last Updated on Fri, Aug 10 2018 9:52 PM

tdp leaders dadagiri in vijayawada - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : రాజధాని అమరావతిలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైంది. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా దాడులకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలో పోలీసు యంత్రాంగం విఫలమవుతోంది. తాము చెప్పిందే వేదం... చెప్పినట్లు వినాల్సిందే.. లేదంటే దాడే.. అన్న రీతిలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. సచివాలయానికి కూతవేటు దూరంలో రోడ్డు పైనే సాధారణ జనాన్ని చితకబాదుతున్నారంటే రాజధానిలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

మందడానికి చెందిన టీడీపీ నేత గుర్రం సాయికృష్ణ ఓ హోటల్‌ మేనేజర్‌పై నడిరోడ్డుపైనే కర్రలతో దాడికి పాల్పడ్డాడు. పాత బకాయి చెల్లించి బిర్యానీ తీసుకెళ్లాలని సూచించడంతో... నన్నే డబ్బులు అడుగుతావా అంటూ మేనేజర్‌పై ఒక్కసారిగా కర్రలతో దాడికి దిగాడు. ఈ ఘటన ఈ నెల 17వ తేదీ జరగగా 18వ తేదీ పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి జరిగిన రోజే బాధితుడు జి. నాగసురేష్‌ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసేందుకు జంకినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు వెనక్కి తీసుకోకుంటే  తీవ్ర పరిణామాలు ఉంటాయని టీడీపీ నేతలు హెచ్చరించినా బాధితుడు వెనక్కి తగ్గకపోవడంతో ఎట్టకేలకు 18వ తేదీ దాడికి పాల్పడిన గుర్రం సాయి, శశిధర్, శ్రీనివాసరావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిని కేసు నుంచి ఎలాగైనా తప్పించేందకు ఓ జెడ్పీటీసీ సభ్యుడితో సహా నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ప్రస్తుతం వీరంతా పరారీలో ఉన్నారని తుళ్లూరు పోలీసులు చెబుతున్నారు. 

మందడం టీడీపీ నేతలపైనే ఫిర్యాదులు
స్థలం విషయమై తాను చెప్పినట్లు వినకపోవడంతో ఈ ఏడాది జనవరిలో మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. మందడం పంచాయతీ కార్యాలయంలోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతూ, భౌతికంగా దాడి చేశాడు. ఈ ఘటనతో షాక్‌కు గురైన పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీడీపీ నేతపై కేసు నమోదు చేయకుండా అప్పట్లో నియోజకవర్గ నేతలు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అయితే పంచాయతీ కార్యదర్శి వెనక్కితగ్గకపోవడంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. 

టీడీపీ హయాంలో ప్రజలకు రక్షణ కరువు
ఈ ఏడాది ఫిబ్రవరిలో తుళ్లూరు మండలం వెంకటపాలెంలో రెండో దశ నీరు – ప్రగతి కార్యాక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా జి.కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు సీఎం ముందు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో జల సంరక్షణ కాదు.. జనానికి రక్షణ కరువైందని వాపోయాడు. మందడం గ్రామానికి చెందిన మాదల సుబ్బయ్య కుమారుడు తనపై దాడి చేసినా పోలీసులు పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమయ్యాడు. దీంతో సీఎం కల్పించుకుని రామాంజనేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు వంతపాడేలా మాట్లాడారు. 

అనంతరం రామాంజనేయులుకు న్యాయం చేయాలని రూరల్‌ ఎస్పీ అప్పలనాయుడును ఆదేశించారు. ఇది జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అలాగే అనంతవరంలో మట్టి తరలింపులో టీడీపీ నేతల మధ్యే బేదాభిప్రాయాలు తలెత్తడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రాజధాని గ్రామాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని వారు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement