పేరు మహిళా సంఘాలది..అధికారం తమ్ముళ్లది..
పాలకొండ రూరల్/వీరఘట్టం: మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఇసుక రీచ్‌ల నిర్వహణ వారికి అప్పగించామని సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. మహిళల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతాయని చెబుతోం ది. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. టీడీపీ స్థానిక నేతలు రీచ్‌ల్లో అధికారం చలాయిస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులను అమాయకులను చేసి ఆడుకుంటున్నారు. ఎక్కడికక్కడ రీచ్‌లను తమ ఆధీనంలో ఉంచుకుని అడ్డంగా లక్షల రూపాయిలు కొల్లగొడుతున్నారు. జిల్లాలో ని ఆకులతంపర, అల్లెన, దంపాక, కాఖండ్యాం, కల్లేపల్లి, యరగాం, బత్తేరు, తలవరంలలో ఇప్పటికే ర్యాంపులు కొనసాగుతున్నాయి. పురుషోత్తపురం, పెద్దసవలాపురం ల్లో రీచ్‌లు గుర్తించినప్పటికీ సాంకేతిక కారణాలతో ప్రారం భం కాలేదు. ఇప్పటికే ఇసుక తోడుతున్న అన్ని ప్రాంతాల్లో మహిళా సంఘాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. రీచ్‌లున్న ప్రాంతాల్లో స్థానికంగా బోలెడన్ని సమస్యలు లేవనెత్తాయి. ప్రతి రీచ్‌లోనూ టీడీపీ నేతల హవా కొనసాగుతోంది.
రీచ్‌ల వద్ద ఆధిపత్య పోరు
గ్రామాల్లో టీడీపీ గ్రూపు రాజకీయాలతో ఆదిపత్యపోరు తొలినుంచి జరుగుతున్న మాట బహిరంగ సత్యం. ఇటీవల పాలకొండలో నియోజకవర్గ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలు, ఆరోపణలతో రోడ్డున పడిన విషయం ఇందుకు నిదర్శనం. ఇదే తీరును ఇసుక ర్యాంపుల వద్ద కూడా ఆయా ప్రాంతాలకు చెందిన నేతలు తమవర్గానికంటే తమవర్గానికి పైచేయంటూ నిర్వాహక మహిళా సంఘాలపై తీవ్ర ఒత్తిడిలు తెస్తున్నట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం అటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు దంద్వవైఖరి కారణంగా ప్రభుత్వమే నష్టపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ప్రారంభం కానివద్ద స్థానిక అధికార పార్టీ నేతలు ప్రభుత్వ అభివృద్ధి పనులకని చెప్పి ట్రాక్టర్లతో యథేచ్ఛగా ఇసుక తరలించుకుపోతున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతల మధ్య పొసగని సయోధ్యల కారణంగా రీచ్‌లు నిర్వహిస్తున్న మహిళా సంఘాలు, పర్యవేక్షిస్తున్న అధికారులు సైతం నిష్పక్షపాతంగా వ్యవహరించలేని పరిస్థితి దాపురించింది.
అవగాహన లేకపోవడం వల్లే
గ్రామీణ ప్రాంత స్వయంశక్తి సంఘాలకు మైనింగ్ విభాగంపై ఏమాత్రం అవగాహన తెలుస్తోంది. ఇసుక రీచ్‌లు, క్యూబిక్ మీటర్లు, వేబ్రిడ్జిలు, నిబంధనలకు సంబంధించిన పలు ధ్రువపత్రాలు అంటే ఏమిటో కూడా వీరికే మాత్రం తెలియదని అధికారులే చెబుతున్నారు. వేబిల్లులు అసలు, నకిలీ తేడా కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందని అంటున్నారు. కొందరు లారీకి వెనుక భాగంలో రెండు అడుగుల మేర పొడుగు పెరిగేలా ప్రత్యేక రేకులను ఏర్పాటు చేసి ఇసుక తరలించుకుపోతున్నారు. ఇదంతా ఆయా ప్రాంతాల్లో ఉన్న అధికార పార్టీ నేతలు కనుసన్నల్లో జరుగుతోంది. తాజాగా వీరఘట్టం మండలంలోని ఇసుకరీచ్‌లను నియోజకవర్గ ఎమ్మెల్యే కళావతి సందర్శించినప్పుడు అక్కడ స్వయం శక్తి సంఘాల మహిళలు మాట్లాడుతూ ఎవరికి నచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారని, అడిగితే ఖబడ్దార్ అంటూ భయపెడుతున్నార ని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
తలవరం తొలి నుంచి వివాదమే
వీరఘట్టం మండలం తలవరం ఇసుక ర్యాంపు నవంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి వివాదస్పదంగానే నడుస్తోంది. ప్రారంభించి 20 రోజులు గడవక ముందే లక్షల్లో ఇసుక తరలిపోయిందని వివాదాలు మొదలయ్యాయి. తాజాగా మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన ఒకే బిల్లుపై అధిక లోడ్లును తీసుకువెళ్లారంటూ అధికారులే గుర్తించారు.
అక్రమార్కులను వదలం
వీరఘట్టం: తలవరం ర్యాంపులో ఇసుక అక్రమాలకు పాల్పడింది ఎవరైనా ఉపేక్షించేది లేదని..వారిని వదిలి పెట్టం అని పాలకొండ ఆర్‌డీఓ సాల్మన్‌రాజ్ అన్నారు. మంగళవారం ర్యాంపు వద్ద నకిలీ ధ్రువపత్రాలను పరిశీలించారు. నకలీ ధ్రువపత్రాలను ఎలా గుర్తించారని కమ్యూనిటీ సర్వేయర్ దుర్గారావు, ర్యాంపు నిర్వాహకురాలు గేదెల లక్ష్మి, మండల సమైఖ్య అధ్యక్షురాలు కె.లలితకుమారిని అడిగి తెలుసుకున్నారు. నకలి బిల్లులకు కారణమైన మీ సేవ కేంద్రంను రద్దు చేస్తామన్నారు.దోషులను పట్టుకుంటాం: నకిలీ బిల్లులతో ఇసుకను తరలించుకు పోయిన దోషులను పట్టుకుంటామని పాలకొండ సర్కిల్ ఇన్ప్‌క్టెర్ ఎన్.వేణుగోపాలరావు అన్నారు. మంగళవారం ర్యాంపు వద్ద నకిలీ ధ్రువపత్రాలను పరిశీలించి ర్యాంపు నిర్వాహకుల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.
మైనింగ్ అధికారుల కొలతలు
వీరఘట్టం: తలవరం ఇసుక ర్యాంపులో మైనింగ్ అధికారులు మిగిలి ఉన్న ఇసుక నిల్వలకు మంగళవారం కొలతలు వేశారు. ఇంతవరకు ఎంత ఇసుకను విక్రయించారు, మిగిలిన ఇసుక ఎంత ఉంది అనే లెక్కలు టేపు ద్వారా కొలిచారు. ఈ వివరాలను జాయింట్ కలెక్టరు దృష్టి తీసుకువెళ్లనున్నట్లు మైనింగ్ జేఈ వి.హనుమంతురావు తెలిపారు. ర్యాంపులో సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గతంలో గుర్తించామని, అయితే ప్రస్తుతం ఉన్న ఇసుక మరో పది రోజుల్లో విక్రయిస్తే ర్యాంపు పూర్తవుతుందన్నారు.