కేడీసీసీపై తమ్ముళ్ల కన్ను | tdp leaders effort on kurnool district cooperative central bank chairman post | Sakshi
Sakshi News home page

కేడీసీసీపై తమ్ముళ్ల కన్ను

Published Wed, Jul 23 2014 12:23 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

tdp leaders effort on kurnool district cooperative central bank chairman post

సాక్షి ప్రతినిధి, కర్నూలు : కర్నూలు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ)పై తెలుగు తమ్ముళ్లు గురిపెట్టారు. మొన్న అడ్డదారుల్లో జెడ్పీని కైవసం చేసుకున్న టీడీపీ నేతలు నేడు కేడీసీసీ బ్యాంక్‌ను కూడా బలవంతంగా లాక్కునేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుత పాలకవర్గంపై అవిశ్వాసం పెట్టి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ నేతలు కాంగ్రెస్ డెరైక్టర్లను కొనుగోలు చేసేందుకు రంగం సిద్దం చేశారు. అయితే ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

 రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావటంతో తమ్ముళ్ల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. రేషన్‌షాపులు, పాఠశాలలో మధ్యాహ్నభోజనం నిర్వహణ, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శరైతులు వంటి వాటిని అనుచరులకు కట్టబెట్టేందుకు అడ్డమైనదారులు తొక్కుతున్న విషయం తెలిసిందే. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్ పీఠాలను దౌర్జన్యంగా దక్కించుకున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. కర్నూలు జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ పాలకవర్గానికి 2013లో ఎన్నికలు నిర్వహించారు.

 ఆ ఎన్నికల్లో వివిధ సహకార సంఘాల నుంచి 16 మంది డెరైక్టర్లు ఎన్నికయ్యారు.  అయితే వీరంతా అప్పట్లో కాంగ్రెస్ మద్దతుదారులే. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 16 మంది, గొర్రెలు, చేనేత సంఘాలు, హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా ఐదుగురు డెరైక్టర్లు కేడీసీసీబీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరంతా కలిసి కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అందుకు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, మరి కొందరు కాంగ్రెస్ నాయకులు సహకరించారు.

 కాంగ్రెస్ నేతల్లో మాజీ మంత్రులు టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. డెరైక్టర్లలో వీరి మద్దతుదారులు కూడా ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ డెరైక్టర్ల చేతనే అవిశ్వాసం పెట్టే ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నట్లు సమాచారం.  

 డెరైక్టర్లను కొంటున్నారు
 బ్యాంకు అధ్యక్షురాలు శ్రీదేవిపై డెరైక్టర్ల చేత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఓ మాజీ మంత్రి ద్వారా రంగం సిద్ధమవుతోంది. కొందరు డెరైక్టర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ముట్టజెప్పేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు తేదీ కూడా ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో అవిశ్వాసంపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ మొదలయ్యింది. ఆగస్టు మొదటి వారంలో ప్రత్యేక సమావేశం జరపనున్నట్లు చర్చ జరుగుతోంది.

ఎవరి బలం ఎంత ఉందో ఆ రోజు తేలిపోనుండటంతో సహకార బ్యాంకు రాజకీయం మరింత వేడెక్కనుంది. డెరైక్టర్లను క్యాంపులకు తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్న నేత సోదరుడు, మాజీ మంత్రి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొంతమంది డెరైక్టర్ల చేత సంతకాలు కూడా సేకరించినట్లు సమాచారం. మొత్తం 21 మంది డెరైక్టర్లు ఉండగా వారందరినీ క్యాంపునకు తరలించేందుకు మాజీ మంత్రి ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement