
రాజ్యాంగమా.. నీకు రక్షణేదీ?
ఎన్నికలు అంటేనే అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి.
► యథేచ్ఛగా ఉల్లంఘనలు...చట్టాన్ని అమలు చేయడంలో విఫలం
► సభ్యులు మినహా ఇతరులెవ్వరూ కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లకూడదు
► టీడీపీ అధ్యక్షుడికి నిబంధనలు సడలించిన అధికారులు
► రెండురోజులపాటు విచ్చలవిడి దౌర్జన్యకర ఘటనలు
► అధికారపార్టీకి జీ..హుజూర్ అంటున్న యంత్రాంగం
‘నిద్రపోతున్నవాడిని లేపొచ్చు, నిద్రపోతున్నట్లు నటించేవాడిని లేపడం చాలాకష్టం.’ అచ్చం అలాగే కన్పిస్తోంది జిల్లా యంత్రాంగం వైఖరి. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా, చట్టానికి లోబడి, రాజ్యాంగబద్ధులై విధులు నిర్వర్తించాల్సిన వారు ఏకపక్ష చర్యల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’గా పోలీసు అధికారులతో కలిసి 600 మంది బందోబస్తు విధుల్లో ఉండి కూడా 41మంది సభ్యులకు సంబంధించిన ఎన్నికను నిర్వహించలేక అభాసుపాలయ్యారు. పరపతి ఉంటే రాజ్యాంగానికే దిక్కుమొక్కు ఉండదని నిరూపించారు.
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికలు అంటేనే అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్నికల కమిషన్‌కు లోబడి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఏకపక్ష చర్యలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే గత రెండురోజులుగా జిల్లాలో అధికారులు ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అధికారపార్టీ నేతలకు ఏకంగా రాజ్యాంగాన్నే తాకట్టు పెట్టారు.
టీడీపీ నేతల డైరెక్షన్‌లో జిల్లా అధికారులు అద్భుతంగా స్క్రీన్‌ప్లే చేశారు. ఓవైపు కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పటిష్టమైన బందోబస్తు, 144 సెక్షన్ అమలు అంటూనే, గుంపులు గుంపులుగా వందల మంది వీరంగం సృష్టించేందుకు ఆస్కారం ఇచ్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
రక్తి కట్టించిన రెవెన్యూ యంత్రాంగం
తెలుగుదేశం పార్టీ నేతల డైరెక్షన్ మేరకు ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడంలో రెవెన్యూ అధికారులు కీలకంగా వ్యవహరించారు. రెండు రోజులపాటు క్రమం తప్పకుండా సీన్ రక్తి కట్టించడంలో సఫలీకృతులయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. శనివారం కౌన్సిల్ హాల్‌లోకి సభ్యులు మినహా మరెవ్వరికి అనుమతి లేదని అధికారులు నిబంధనలు విధించారు. కాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఏకంగా కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లి కౌన్సిలర్ ముక్తియార్‌ను లాక్కొచ్చే ప్రయత్నం చేశారు.
ఈ ప్రయత్నాన్ని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నిలువరించారు. అయితే శ్రీనివాసులరెడ్డి ఏ హోదాలో కౌన్సిల్ హాల్‌లోకి వెళ్లారు? ఆయన్ను అనుమతించిన వారిపై చర్యలేమైనా తీసుకున్నారా అంటే అధికారుల నుంచి సమాధానమే లేదు. 144 సెక్షన్ అమల్లో ఉన్నా, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వందల మందితో ఎలా వచ్చారు. రాళ్లు రువ్వడం, బీభత్స వాతావరణం సృష్టించడానికి ఆస్కారం ఎలా ఇచ్చారు. ఇందులో వైఫల్యం ఎవరిది? వారిపైన చర్యలేమైనా చేపట్టారా? అనే దానికి కూడా ఎలాంటి సమాధానం లభించడం లేదు.
కౌన్సిల్ హాల్ నుంచి కౌన్సిలర్ పుల్లయ్య ఏకంగా మినిట్స్ బుక్ ఎత్తుకెళ్లారు. రెండవరోజు అయినా అలాంటి ఉపద్రవం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఎందుకు గ్రహించలేకపోయారు. రెండు గంటల పాటు విధ్వంసం సృష్టిస్తుంటే ఎందుకు నిలువరించే ప్రయత్నం చేయలేదు? రిటర్నింగ్ అధికారి, ఎన్నికల అబ్జర్వర్ చూస్తుండిపోవడమే విధిగా భావించారా? కావాలనే మౌనం దాల్చారా? సభ్యులు మరింత రెచ్చిపోవాలనే అలా వ్యవహరించారా? అంటే అవును అనే సమాధానాన్ని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాజ్యాంగం మేరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారుల ఏకపక్ష చర్యల వెనుక అధికార పరపతి అధికంగా ఉన్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ పెద్దలను ఛీకొడుతున్న ప్రజానీకం
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అధికారులు అవలంబించిన తీరు, తెలుగు తమ్ముళ్లు సృష్టించిన విధ్వంసకర చర్యలు, ఎన్నికను వాయిదా వేసిన విధానాన్ని పరిశీలించిన ప్రజానీకం ప్రభుత్వ పెద్దలను ఛీ కొడుతున్నారు. 41 మంది సభ్యులున్న ఎన్నికను నిర్వహించలేని అసమర్థత అధికారులను ఆవహించడం, బలం లేకపోయినా చైర్మన్ గిరిని ఏకపక్షంగా టీడీపీ అభ్యర్థి ఆసం రఘురామిరెడ్డికి కట్టబెట్టాలనే తలంపుపై అసహ్యించుకుంటున్నారు.
అధికార పార్టీ నేతలకు అధికారులు జీ...హుజూర్‌గా మారడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. చట్టాన్ని అమలు చేయకుండా ఎటూ గాని విధంగా వ్యవహరించడం ఏమేరకు సబబో అంతరాత్మను ప్రశ్నించుకోవాలని ప్రజాస్వామ్యవాదులు ఘాటుగా స్పందిస్తున్నారు.