..ఫోనొస్తే వణుకే | tdp leaders put pressure on officiers | Sakshi
Sakshi News home page

..ఫోనొస్తే వణుకే

Published Sun, Dec 28 2014 3:03 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

..ఫోనొస్తే వణుకే - Sakshi

..ఫోనొస్తే వణుకే

అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. అధికారులను ఇంట్లో పనివారిగా జమకడుతూ.. చెప్పినట్లు వినాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. నేతల మాటల తీవ్రత, వారు ఉపయోగిస్తున్న పదజాలానికి అధికారులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బయట పడి కొందరు, చెప్పుకోలేక మరికొందరు తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ వస్తే చాలు వణికి పోతున్నారు. రాజకీయ పెత్తనం ఇలానే కొనసాగితే ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదని, అర్హులకు అన్యాయం చేయూల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
సాక్షి ప్రతినిధి, అనంతపురం :  అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. కోర్టు ఆదేశాలను ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమ అస్మదీయులకు మేలు చేసేలా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు హుకూం జారీ చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని చెబుతున్న తహశీల్దార్లపై భౌతిక దాడికిదిగడం, పరుష పదజాలంతో దుర్భాషలాడం చేస్తున్నారు.

దీంతో ఒత్తిళ్లు తాళలేక జిల్లాలో ఇప్పటికే నలుగురు తహశీల్దార్లు సెలవులో వెళ్లారు. మరో ఏడుమంది తహశీల్దార్లు ఏ క్షణమైనా సెలవులో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.     తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నేతలు అధికారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ప్రతీ ఆదాయ వనరు తమకే దక్కాలనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖకు చెందిన రేషన్ డీలర్ల తొలగింపు, కొత్తవారి నియామకం, ఇసుక అక్రమ రవాణా అంశాల్లో వీఆర్వో నుంచి ఆర్డీవోల దాకా అధికారులందరిపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయి. పైగా పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉండటంతో టీడీపీ నేతలు పట్టపగ్గాల్లేకుండా వ్యవహరిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా 2,886 మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరిలో సింహ భాగం 2004-05 నుంచి రేషన్‌డీలర్లుగా కొనసాగుతున్నారు. దాదాపు వీరంతా కాంగ్రెస్ పార్టీ హయూంలో నియమితులైనవారే. వీరిలో చాలా మంది కాంగ్రెస్ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వస్తే... కొంత మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీ గ్రామంలోనూ రేషన్ డీలర్లను తొలగించే కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు పూనుకున్నారు. వారి స్థానంలో తమ అస్మదీయులను నియమించేలా అధికారులకు హకూం జారీ చేశారు. మంత్రి పరిటాల సునీత కూడా టీడీపీ నేతలు సూచించిన వారికే రేషన్‌షాపులు కట్టబెట్టాలని జిల్లా అధికారులకు మౌఖికంగా ఆదేశించారు.

దీంతో దాదాపు అన్నిచోట్లా పాత డీలర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. ఇందులో కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో కొత్తగా నియమితులైన వారిని తప్పించి తిరిగి పాత వారికే రేషన్‌షాపులను స్థానిక తహశీల్దార్లు కట్టబెట్టారు. ఈ పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక, తహశీల్దార్లపై ప్రతాపాన్ని చూపుతున్నారు. గుడిబండ తహశీల్దార్ వే ణుగోపాల్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. బ్రహ్మసముద్రం, కుందుర్పి, ధర్మవరం తహశీలార్లను కూడా తీవ్ర పదజాలంతో దూషించారు. దీంతో వీరంతా సెలవులో వెళ్లిపోయారు.

ఇసుక తవ్వకాలపై కూడా ఒత్తిళ్లు
జిల్లాలో అధికారికంగా మూడు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. శింగనమల పరిధిలో ఉల్లికల్లు, తాడిపత్రి పరిధిలో చిన్న ఎక్కలూరు, ధర్మవరం పరిధిలో చిన్నచిగుళ్ల రేవు రీచ్‌లు ఐకేపీ సంఘాలకు కట్టబెట్టారు. ఇక్కడ మినహా వేరేచోట ఎక్కడా తవ్వకాలు జరపకూడదు. పెట్టుబడి లేకుండా రోజూ లక్షల రూపాయం ఆదాయం వచ్చే మార్గం ‘ఇసుక తవ్వకాలే’అని అధికార పార్టీ నేతలు గ్రహించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇసుక జాడ ఉన్న ప్రతీచోట అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నారు. దొరికినంత దోచుకుంటున్నారు.

ఈ అంశంలో కొందరు అధికారులు చూసీ చూడనట్లు పోతుంటే, ఇంకొందరు మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. తమ అక్రమార్జనకు అడ్డుపడుతున్నారనే అక్కసుతో అలాంటి తహశీల్దార్లపై విరుచుకుపడుతున్నారు. సెలవులో వెళ్లిన తహశీల్దార్లు కాకుండా మరో ఏడుగురు సెలవులో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వీరిలో కళ్యాణదుర్గం తహశీల్దార్ గోపాల్‌రెడ్డి నేడో, రేపో సెలవులో వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులపై వేధింపుల నేపథ్యంలో ఆ సంఘం ప్రతినిధులు కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
 
‘ప్లాన్ ఆఫ్ యాక్షన్’ రూపొందిస్తున్నాం: నీలకంఠారెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెవెన్యూ అధికారులపై దాడులు, వేధింపులకు దిగడం దారుణం. ఏదైనా ఉంటే నిబంధనల మేరకు పని చేయించుకోవాలి. వినకపోతే ఉన్నతాధికారులకు చెప్పాలి. ప్రజాస్వామిక పద్ధతులలో వ్యవహరించాలి. అంతేకానీ దాడికి దిగడం, తిట్టడం సరికాదు. ఇప్పటికే గుడిబండ ఘటనపై ఫిర్యాదు చేశాం. రాష్ట్ర అధ్యక్షునికి పరిస్థితిని వివరించాం. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నాం.

జిల్లాలో సెలవు పెట్టిన తహశీల్దార్ల పరిస్థితి ఇది:
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలంలో కాంగ్రెస్ హయాంలో నియమించిన రేషన్‌డీలర్లను టీడీపీ నేతలు తొలగించారు. అందులో ఇద్దరు డీలర్లు కోర్టుకు వెళ్లడంతో వాళ్లను అలాగే కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తహశీల్దార్ వేణుగోపాల్ అమలు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు తహశీల్దార్‌పై భౌతిక దాడికి దిగారు. 15 రోజుల పాటు కోమాలో ఉన్న నాయక్ వేణుగోపాల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం ఎర్రగొండాపురంలో 150 ఎకరాల పొలంపై కోర్టు తీర్పును ధిక్కరించి, నిబంధనలకు విరుద్ధంగా అడంగల్‌లో తమ పేర్లు చేర్చాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా తహశీల్దార్ హరిలాల్‌నాయక్‌ను ఒత్తిడి చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తాను ఏ పని చేయలేనని చెప్పినందుకు ఇతన్ని తీవ్రంగా తిట్టారు. ఇసుక వ్యవహారంలో కూడా తమకు అనుకూలంగా వ్యవహరించలేదని టీడీపీలోని మరోవర్గం కూడా ఇదేరీతిలో వ్యవహరించింది. దీంతో ఈ నెల 26 నుంచి తహశీల్దార్ సెలవులో వెళ్లారు.
 
కుందుర్పి మండలం వడ్డెపాళెంలో ఓ టీడీపీ నేత దళితులకు చెందిన అసైన్డ్ పొలాలను కొనుగోలు చేశారు. వీటికి పాసుపుస్తకాలు ఇవ్వాలని తహశీల్దార్ వెంకటనారాయణపై ఒత్తిడి తెచ్చారు. దళితుల అసైన్డ్ పొలాలు కొనుగోలు చేయడం నేరమని, పైగా వాటికి పాసుపుస్తకాలు ఇవ్వడం కుదరదని తహశీల్దార్ చెప్పారు. దీంతో తహశీల్దార్‌ను పరుష పద జాలంతో దూషించారు. దీంతో ఆయన 26 నుంచి సిక్ లీవ్ పేరుతో వెళ్లారు.

ధర్మవరంలో రేషన్‌డీలర్ల చిచ్చుతోనే తహశీల్దార్ కేశవనాయుడు సెలవులో వెళ్లిపోయారు. ఇక్కడ కాంగ్రెస్ హయాంలో నియమించిన రేషన్ డీలర్లను తొలగించి, టీడీపీ సానుభూతి పరులకు కట్టబెట్టారు. ఇందులో 30 మంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. దీంతో తిరిగి పాత వారిని నియమించారు. దీనిపై ఎమ్మెల్యే వరదాపురం సూరి తహశీల్దార్‌పై తీవ్రంగా స్పందించి చేతకాకపోతే సెలవులో వెళ్లిపోవాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతోనే నాయుడు సెలవులో వెళ్లిపోయారు. నాయుడు రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement