
వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నేతలపై టీడీపీ కన్ను
► కొమ్మలపై కన్ను!
► వైఎస్సార్ సీపీ ద్వితీయ శ్రేణి నేతలపై టీడీపీ కన్ను
► ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు కుట్రలు..కుతంత్రాలు
► వ్యాపారాలకు అడుగడుగునా ఆటంకాలు..అడ్డగింతలు
► పార్టీకి దూరం చేసేందుకు ‘శక్తిమేర’ విఫలయత్నాలు
మహావృక్షంగా ఎదిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలకు అంతమే లేదు. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలపై సైతం అక్రమ కేసులు బనాయించేందుకు వెనుకాడడం లేదు. చివరకు మహావృక్షానికి చిరు కొమ్మల్లాంటి ద్వితీయ శ్రేణి నాయకులను దెబ్బతీసే దుశ్చర్యకు తెరతీశారు. ఈ సారి వారి ఆర్థిక మూలాలపై ఎక్కుపెట్టారు. అధికారులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా వెంటాడుతూ వేధింపులకు దిగుతున్నారు.
గుంటూరు : వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులపై టీడీపీ నేతలు కన్నేశారు. అధికారుల సాయంతో వేధింపులకు దిగుతున్నారు. వారి వ్యాపారాలకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లలో పాత కేసులు ఉంటే తిరగదోడుతున్నారు. ఆ వివరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపడం తోపాటు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆర్థిక మూలాలకు నష్టం కలిగిస్తే వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పనిచేయలేరనే ఉద్దేశంతో వారి వ్యాపారాలపై దాడులు చేయిస్తున్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంఘటనకు ముందు నుంచే ఈ ప్రక్రియను చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. కొత్త కార్యకర్తలను పార్టీలో చేరకుండా చేస్తున్నారు. పాతవారిపై నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారు.
ఇవిగో ఉదంతాలు..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా పనిచేసిన బడుగు నాగరాజు చౌకధరల దుకాణాన్ని రద్దు చేయించి టీడీపీ కార్యకర్తకు కేటాయించారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ఆ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపునకు గట్టిగా కృషి చేశారు. ఫలితాల తరువాత నాగరాజు దుకాణంపై వివిధ వర్గాల ప్రజలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయించారు. విచారణలో దుకాణం నిర్వహణలో లోపాలున్నాయనే కారణం చూపి రద్దు చేయించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.
గుంటూరు రూరల్ పరిధిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న మండెపూడి పురుషోత్తంకు సమీప బంధువు గుడిపూడి అరుణ పేరున ఉన్న చౌకధరల దుకాణంపై కూడా పార్టీ నేతలు అధికారులను అడ్డు పెట్టుకుని వేధింపులకు దిగుతున్నారు. దుకాణాల ఎంపిక సమయంలో నిర్వహించిన రాత పరీక్షలో అరుణకు మంచి మార్కులు వచ్చినా రాత పరీక్షలో ఫెయిల్ అయినట్టుగా చూపారు. సమాచార హక్కు చట్టం ద్వారా అరుణ రాసిన పరీక్ష పత్రంలో సమాధానాలు సక్రమంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించి గోరంట్లకు సమీపంలోని నగరాల్లో 247 దుకాణాన్ని కేటాయించారు. ఆ దుకాణం ప్రారంభించిన పదిరోజుల్లోనే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలించారు. అన్నీ సక్రమంగా ఉండడంతో వెనుతిరిగారు.
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ పట్టణంలో వైఎస్సార్ సీపీలో చురుగ్గా పనిచేస్తున్న కౌన్సిలర్లపై ఇదే వివక్ష కొనసాగుతోంది. పిడుగురాళ్ళ మండల అధ్యక్షులు చల్లా పిచ్చిరెడ్డిపై కాల్‌మనీ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఆ కేసుతో పిచ్చిరెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ జైలుకు పంపించారు. 15వ వార్డు కౌన్సిలర్ మందా డానియేలు ప్రజా సమస్యలపై కౌన్సిల్ సమావేశంలో గళం విప్పుతున్నాడనే ఉద్దేశంతో కేసులు మోపి జైలుకు పంపించారు. మూడు కౌన్సిల్ సమావేశాలకు వరుసగా హాజరుకాకపోతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధనను అన్వయించేందుకు, మూడో కౌన్సిల్ సమావేశానికి వస్తున్న డానియేలును పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. అయితే మహిళలు, ప్రజా సంఘాల నాయకులు అడ్డుపడి సమావేశానికి తీసుకువచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి రేబాల శ్రీనివాసరావుపై కాల్‌మనీ కేసు బనాయించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి, వివాదం తీవ్రమౌతుందనే భయంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు.
దాచేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఇలా పార్టీ తరఫున ఉత్సాహంగా పనిచేస్తున్న వారిపై కేసులు పెట్టేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసులను ‘శక్తిమేర’ వాడుకుంటున్నారు. ఆపై పోలీసులూ ఓవర్‌యాక్షన్ చేస్తున్నారు.