భూ ఉద్యమం అణచివేతకు {పభుత్వ పన్నాగం
వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు
సంఘటితమవుతున్న అన్నదాతలు
మచిలీపట్నం : టీడీపీ సర్కార్ భూదందాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇవి కచ్చితంగా కక్ష సాధింపు చర్యలేనని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం భూ బ్యాంకు పేరుతో వేలాది ఎకరాలను సేకరించి ఆ భూములను విదేశీ సంస్థలకు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా గత ఆగస్టు 30న పోర్టు, అనుబంధ పరిశ్రమల పేరిట బందరు మండలంలో 14,427 ఎకరాల ప్రైవేటు భూమి, మరో 15వేల ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 24 గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భూమిని ప్రభుత్వం లాక్కుంటే తమ జీవనం ఎలా గడుస్తుందనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ తరుణంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) వామపక్ష నాయకులతో కలిసి రైతుల పక్షాన ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ భూపరిరక్షణ పోరాట సమితులను ఏర్పాటుచేశారు.
రైతులకు ముఖం చూపలేకే..
పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 30 వేల ఎకరాల భూమిని సేకరించే పనిని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు తమ భుజాలకు ఎత్తుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన అనంతరం భూమి కోల్పోయే గ్రామాల్లో రైతులతో సమావేశమయ్యారు. కోన, బుద్దాలపాలెం, మేకావానిపాలెం, చిన్నాపురం తదితర గ్రామాల్లో వీరికి చుక్కెదురైంది. ఒక్క సెంటు భూమి కూడా అనుబంధ పరిశ్రమల కోసం ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి భూసమీకరణ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని, తుళ్లూరు తరహా ప్యాకేజీని అందజేస్తామని మంత్రి, ఎంపీ చెప్పినా రైతులు అంగీకరించలేదు. ఇటీవల రెవెన్యూ అధికారులు గ్రామాల్లో నిర్వహించిన ‘మీ ఇంటికి-మీ భూమి’ సదస్సుల్లోనూ రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పొట్లపాలెంలో కుర్చీలు తగులబెట్టి రైతులు తమ నిరసస తెలియజేయగా.. పోతేపల్లిలో పోలీసుల దెబ్బలను సైతం లెక్క చేయకుండా రైతులు అధికారుల వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. పరిస్థితి చేయిదాటడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు.
అక్రమ కేసులు బనాయించి
పోతేపల్లి, పొట్లపాలెం, బుద్దాలపాలెం గ్రామాల్లో ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని రైతులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల వ్యూహం రైతుల ముందు పనిచేయకపోవడంతో వారు తమ పన్నాగాన్ని మార్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ నాయకులను దెబ్బతీసేందుకు అక్రమ కేసులు బనాయించే అంశంపై టీడీపీ నాయకులు దృష్టిసారించారు. అనుకున్నదే తడవుగా బందరులోని వైఎస్సార్ సీపీ నాయకులకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్లపై దాడులకు తెగబడ్డారు. దీనిపై ఎక్సైజ్ సీఐ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన పార్టీ నాయకులపై ఎక్సైజ్ ఎస్.ఐ. శ్రీనివాస్‌తో చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. మంత్రి కొల్లు రవీంద్ర నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని తెరవెనుక ఒత్తిడి తెచ్చారనే వాదనలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. పది, పదిహేను రోజుల పాటు వీరిని జైలులో ఉంచితే భూ ఉద్యమం నీరుగారుతుందన్న వ్యూహంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి అరెస్టుకు పాల్పడడం చర్చనీయాంశమైంది. టీడీపీ నేతల కుట్రను ఎదుర్కొనేందుకు టౌన్‌హాలులో వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశం ఏర్పాటుచేయగా గేట్లు మూసివేసి ఎవరినీ బయటకు రానీయకుండా పోలీసులు నిర్బంధించడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత పేర్ని నాని ఇంటికి వెళ్లి అరెస్టుచేయడంతో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ముందస్తు వ్యూహంలో భాగంగా నాన్‌బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా న్యాయమూర్తి తిరస్కరించారు. కాగా తాము బెయిల్‌పై బయటకు వచ్చాక భూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని పేర్ని నాని, నాయకులు స్పష్టం చేశారు. మంత్రి, ఎంపీ భూదాహానికి అడ్డుకట్ట వేస్తామని, 24 గ్రామాల రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
గుడివాడలో టీడీపీ నేతల వీరంగం
గుడివాడలో టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, రావి వెంకటేశ్వరరావు వీరంగం వేశారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయానికి తమ అనుచరులతో వచ్చి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే కొడాలి నానిపై సవాళ్లు విసిరారు. పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆదివారం ప్రశ్నించినందుకే అరెస్టు చేసి హడావుడి చేసిన పోలీసులు.. టీడీపీ నేతలపై మాత్రం ఎలాంటి కేసూ నమోదు చేయలేదు.
కక్ష గట్టి
Published Tue, Nov 17 2015 1:30 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement