అనంతపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్‌లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా
రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్‌చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు.
పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్‌చార్జ్‌లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు.
నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్‌చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్‌బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు.
ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు
రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment