♦ టీడీపీ నేతల పర్యటన.. అటెన్షన్‌లో అధికారులు
♦ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్.. క్యూకట్టిన యంత్రాంగం
కడప: ‘నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు’ అన్నట్లుగా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ విస్మరించడం, మరోవైపు టీడీపీ నేతలకు ప్రభుభక్తి ప్రదర్శించడాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అనేక విమర్శలు తలెత్తినా అధికారుల ధోరణిలో మార్పు రావడం లేదు. తాజాగా శనివారం కడపలో అలాంటి ఘటనే తెరపైకి వచ్చింది. హౌసింగ్‌బోర్డుకాలనీ పరిధిలోని రాజీవ్‌మార్గ్ లో శనివారం ఉద యం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, హరిప్రసాద్, గోవర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, ఆసం నరసింహారెడ్డి, జయచంద్రారెడ్డిలు పర్యటించారు.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న కార్పొరేషన్ స్థలం ఆక్రమణలను పరిశీలించారు. వాస్తవంలో ఆక్రమణలను తొలగించాలని అధికారులను అభ్యర్థించాల్సిన వారు, ఏకం గా అధికారులతో మార్చ్‌ఫాస్ట్ చేయించారు. ఈఘటన తిలకించిన పట్టణ ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. ఆర్డీఓ చిన్నరాముడు, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, తహసీల్దార్ రవిశంకర్‌రెడ్డి, టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, రెవెన్యూయంత్రాంగమం తా రాజీవ్‌మార్గ్‌లో వచ్చివాలిపోయింది. అధికారహోదా లేకపోయినా నిస్సిగ్గుగా యంత్రాంగం టీడీపీ నేతల వెంట పర్యటించింది. ఇదేమీ వింత పరిస్థితని ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే, ఉద్యోగం ఇక్కడే చేయాలంటే ఇలాంటి పరిస్థితి తప్పదని వాపోడం విశేషం. ఎక్కడికెళ్లినా అధికారులకు ఉద్యోగమే ఉంటుంది. అధికారి స్థాయిని తగ్గించలేరన్న విషయాన్ని పలువురు విస్మరిస్తున్నారు.
వ్యవస్థలు నిర్వీర్యం
అధికారం బలంతో వ్యవస్థలను నిర్వీర్యం చేసే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఆమేరకు వారి చర్యలే రుజువు చేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అభివృద్ధి చేయాలనే తలంపు ఉంటే నేత లు పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేయడం సమంజసం. అలాకాకుండా హోదా కోసం మొత్తం యంత్రాంగాన్ని తిప్పుకోవడం ఏమాత్రం సహేతుకం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధుల పట్ల బాధ్యతతో వ్యవహరించాలి. అలా కాకుండా స్థాయిని దిగజార్చుకొని వ్యవహరించడం ఏమాత్రం సముచితం కాదని పలువురు వివరిస్తున్నారు.