తెగబడిన తమ్ముళ్లు | tdp leaders wnts zp posts | Sakshi
Sakshi News home page

తెగబడిన తమ్ముళ్లు

Published Mon, Jun 30 2014 3:41 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

తెగబడిన తమ్ముళ్లు - Sakshi

తెగబడిన తమ్ముళ్లు

జెడ్పీ, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్‌గిరి కైవసానికి కుట్రలు
- కిడ్నాప్‌లకూ వెనుకాడని వైనం
- ప్యాపిలికి చెందిన ఇద్దరు ఎంపీటీసీల అపహరణ
- మరి కొందరి కోసం ప్రలోభాలపర్వం

 సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారం కోసం టీడీపీ నేతలు తెగబడుతున్నారు. బలం లేకపోయినా దౌర్జన్యంగానైనా జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, మునిసిపల్ చైర్మన్ పదవుల కోసం కిడ్నాప్‌లకు తెరతీశారు. ప్యాపిలి మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల కిడ్నాప్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈ మేరకు ఎంపీటీసీల బంధువులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆదివారం జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డికి  ఫిర్యాదు చేశారు.

జిల్లాలో అత్యధికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన
జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్ కౌన్సిలర్లు గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రజాస్వామ్య బద్దంగా అయితే జెడ్పీ చైర్మన్, 22 ఎంపీపీ, ఐదు మునిసిపాలిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి. అయితే టీడీపీ నేతలు ఈ పరిణామాలను జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారు. భారీ ఎత్తున డబ్బు ఆశ చూపిస్తున్నారు. మరి కొందరిని బెదిరిస్తున్నారు. ఇంకొందరిని కిడ్నాప్ చేస్తున్నారు.
 
ప్యాపిలి మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 12, టీడీపీ తొమ్మిదింట గెలుపొందాయి. అందులో వైఎస్సార్ సీపీకి చెందిన ఊటకొండ ఎంపీటీసీ అనారోగ్యంతో మృతి చెందారు. అయినా ఎంపీపీ కావటానికి వైఎస్సార్ సీపీకే బలముంది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు శనివారం రాత్రి ప్యాపిలి-3 ఎంపీటీసీ పెద్దరాజును కారుబాడుగ విషయం మాట్లాడేందుకని ఇతరుల ద్వారా ఫోన్ చేయించి  గుత్తిలో కిడ్నాప్‌కు పాల్పడ్డారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవిని సైతం మభ్య పెట్టారు.

ఆమెతో పాటు ఆమె భర్త శ్రీనివాసులు రెండు రోజులుగా కనిపించటం లేదని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీని వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం జరుగుతోంది. రూ. 5 లక్షల నగదుతో పాటు రేషన్ డీలర్ షిప్‌ను కూడా ఇప్పిస్తామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీలోకి వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ససేమిరా అంటున్నా వారి బంధువుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న ధీమాతో తాము ఏం చేసినా చెల్లుతుందని టీడీపీ నాయకులు  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
వ్యతిరేకంగా ఓటేస్తే అనర్హత వేటే: ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీకి ఓటు వేయడానికి వీలు లేదని, అలా చేసిన వారికి విప్‌ను జారీ చేస్తే వారిపై అనర్హత వేటు పడుతోందని అందరికీ తెలిసిందే. అన్నీ తెలిసీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారిపై ఎలాగైనా అనర్హత వేటు వేయించటమే టీడీపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ పార్టీకి చెందిన ఓ నాయకుడు అభిప్రాయం వ్యక్తం చేయటం గమనార్హం.
 కిడ్నాప్‌లపై స్పందించని పోలీసులు:

టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారని శనివారం పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ ప్యాపిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక పోలీసులు స్పందించక పోవడంతో పెద్దరాజు భార్య వెంకటేశ్వరమ్మ  ఆదివారం జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. టీడీపీ నాయకులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే జక్కసానికుంట్ల ఎంపీటీసీ రమాదేవితో పాటు ఆమె భర్త శ్రీనివాసులు మూడు రోజులుగా కనిపించడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు బోరెడ్డి శ్రీరామిరెడ్డి, రాజా మూర్తి, మల్లికార్జునరెడ్డి తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మేరకు రమాదేవి కుమారుడు హరికృష్ణ ఆదివారం జలదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులు రమాదేవి, శ్రీనివాసులు ఈ నెల 27 వ తేదీ నుంచి కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్యాపిలి మండల టీడీపీ నాయకులే తన తల్లిదండ్రులను కిడ్నాప్ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారని హరికృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.
 
కిడ్నాప్ కేసులో టీడీపీ నాయకులపై కేసు నమోదు
 ప్యాపిలి: వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడు పెద్దరాజును కిడ్నాప్ చేసిన సంఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రసాద్ ఆదివారం తెలిపారు. కారు బాడుగ మాట్లాడేందుకు పెద్దరాజును పిలిచి గుత్తి వద్ద టీడీపీ నాయకులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి భార్య నులక వెంకటేశ్వరమ్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన తన భర్తను టీడీపీ నాయకులు బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు టీడీపీ నాయకులు టి. శ్రీనివాసులు, శాంతు, అర్జున్, వెంకటేష్, హరి, పోదొడ్డి సుంకన్నలతో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement