
కాలవకు అందలం
ప్రభుత్వ చీఫ్ విప్‌గా అవకాశం
అనంతపురం : రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించిన అనంతపురం జిల్లాకు పదవులు కట్టబెట్టడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా.. 12 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి, రాప్తాడు ఎమ్మెల్యేలు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు ఇప్పటికే కేబినెట్‌లో చోటు కల్పించిన చంద్రబాబు... తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని కూడా జిల్లాకే ఇచ్చారు. ఆ పదవికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించారు. కాలవ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగానూ కొనసాగుతున్నారు. ఇదివరకు ఆయన మేనిఫెస్టో కమిటీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా...ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. గతంలో జర్నలిస్టుగా కూడా పనిచేసిన ఈయన బోయ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ వర్గం సమీకరణల్లో భాగంగా 1999లో అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ టికెట్ లభించింది. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
2004, 2009 ఎన్నికల్లోనూ పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో చోటు దక్కించుకున్న పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఇద్దరూ హిందూపురం లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వారు. దీంతో పాటు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మలివిడతలో బీసీ సామాజిక వర్గానికి చెందిన కాలవ శ్రీనివాసులు లేదా పెనుకొండ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిలలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే.. అనంతపురం లోక్‌సభ స్థానం పరిధిలోని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇస్తున్నారు. దీంతో రాష్ట్రస్థాయి పదవిపై ఆశలు పెట్టుకున్న బీకే పార్థసారథి అధినేత తీరుపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బీకే గతంలో పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. రొద్దం జెడ్పీటీసీగా ఉన్న ఆయనకు జిల్లా పరిషత్ చైర్మన్‌గా, ఆ తరువాత 2004లో హిందూపురం లోక్‌సభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. 2009, 2014 ఎన్నికల్లో పెనుకొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి వరుసగా విజయం సాధించారు.
పార్టీలో సీనియర్ కావడంతో పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందారు. ఈ సమీకరణాలతో పాటు బీసీ కావడంతో బీకేకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. అయితే..లాభం లేకపోయింది.
జిల్లా రూపురేఖలు మారేనా?
కరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. రెండు మంత్రి పదవులు, ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కట్టబెట్టింది. శింగనమల ఎమ్మెల్యే యామినీ బాలను విప్‌గా ఎంపిక చేసింది. వీరందరూ కీలక బాధ్యతలు చేపట్టడంతో జిల్లా కరువు పరిస్థితులను రూపుమాపుతారా అని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పటికే అన్ని రంగాల్లోనూ జిల్లా వెనకబడింది. జిల్లాకు పరిశ్రమలతో పాటు, ఐటీ పార్కులు తీసుకువస్తే అభివృద్ధి దిశగా నడిపించిన వారవుతారని ప్రజలు ఆశిస్తున్నారు.