
బొండపల్లి(గజపతినగరం): ఎమ్మెల్యే కనిపించట్లేదంటూ సరదాగా వాట్సాప్‌లో పెట్టిన ఓ పోస్టుపై సదరు టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహోదగ్రుడయ్యారు. ఆ పోస్టు పెట్టాడనే అనుమానంతో ఓ విద్యార్థిపై తన ప్రతాపం చూపారు. తన అనుచరులతో ఆ విద్యార్థిని కిడ్నాప్ చేయించడమేగాక.. పోలీసులకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారు. విద్యార్థి సంబంధికులు, ఇతరులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు(టీడీపీ) కనిపించట్లేదంటూ వాట్సాప్‌లో సరదాగా ఓ పోస్టు హల్‌చల్ చేసింది.
దీనిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీన్ని పెట్టింది బొండపల్లి మండలం గ్రహపతి అగ్రహారం గ్రామానికి చెందిన దామిశెట్టి కృష్ణ కుమారుడు రమణగా అనుమానించారు. దీంతో విజయనగరంలోని ఓ కళాశాలలో చదువుతున్న ఆ విద్యార్థిని గురువారం తన అనుచరులతో కిడ్నాప్ చేయించినట్టు, అనంతరం బొండపల్లి పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆ విద్యార్థిని తమ నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు సైతం తమదైన శైలిలో ప్రతాపం చూపుతున్నట్టు సమాచారం. దీనిపై ఎస్‌ఐ సుదర్శన్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించినప్పటికీ.. ఆయన స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment