
సాక్షి, తిరుమల : తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో స్థానిక ఎమ్మెల్యేకు ఆహ్వానం ఉందా లేదా అని అధికారులు స్పష్టం చేయాలన్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు వెళ్తే ఆలయం ముందు ఉన్న బయోమెట్రిక్ ఎంట్రెన్స్ దగ్గరకి వెళ్లి తెలుసుకోవాలన్నారని సుగుణమ్మ తెలిపారు. సన్నిధిలోని ల్యాండ్ లైన్‌కు కాల్ చేస్తే అక్కడి అధికారులు ఈ రోజు అనునతిలేదని రేపు రమ్మన్నారని చెప్పారు. ఒక స్థానిక ఎమ్మెల్యేగా తనకు అనుమతి ఉందా లేదా అని టీటీడీ అధికారులను ప్రశ్నించారు. లోపల స్వామి వారి మహా శాంతి తిరుమంజననికి ఆలయంలో ఉన్న మహా భక్తులు ఎవరో తమకు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై టీటీడీ చైర్మన్, ఈఓ ఇతర మహా భక్తులకు ఎలా ఆహ్వానం ఇచ్చారో తనకు చెప్పాలన్నారు. తనకు జరిగిన అవమానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు.