రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి
బాలాజీచెరువు(కాకినాడ) :ఉపాధ్యాయులంతా ఏకతాటిపై నిలిచి ఎమ్మెల్సీ అభ్యర్థి చైతన్యరాజును గెలిపించాలని రాజ్యసభ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ, ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు)తో కలిసి ఆమె సోమవారం భీమవరం పట్టణం, పరిసర గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ కళాశాలల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం అభ్యర్థి చైతన్యరాజును గెలిపించాలని కోరారు. పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు పార్టీ కార్యాలయం నుంచి తమకు సమాచారం అందిందని ఎంపీ తెలిపారు.
అనంతరం చైతన్యరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒత్తిడిలేని విద్యావిధానం అమలవుతోందని చెప్పారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకూ త్వరలో హెల్త్‌కార్డులు ప్రభుత్వం ఇవ్వనున్నదని తెలిపారు. అలాగే మహిళా ఉపాధ్యాయులకు రెండేళ్లపాటు చైల్డ్‌కేర్ లీవ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. అలాగే డీసీఈబీ పునరుద్ధరణతోపాటు, పాఠశాలల పనివేళలు మార్పుతోపాటు భాషాపండితులు, పీఈటీల పదోన్నతికి అడ్డంగా ఉన్న జీవో 11,12ను సవరించడం వంటి అనేక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో తాను సఫలీకృతుడనయ్యానన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. భీమవరం మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ చైతన్యరాజును అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఎంపీ సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సీహెచ్.రామానుజయ, చైతన్యరాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎం.సూర్యనారాయణరాజు, టీడీపీ సీనియర్ నాయకుడు మెంటె పార్థసారథి, రాఘురామరాజు, గాదిరాజు సత్యనారాయణ, ఇందుకూరి రామలింగరాజు, బర్రె నెహూ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డీఎన్‌ఆర్ గవర్నింగ్‌బాడీ సభ్యుడు గోకరాజు నరసింహరాజు, మెంటే గోపి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు చలమలశెట్టి రామానుజయ ఉన్నారు.
చైతన్యరాజు తనయుల విస్తృత ప్రచారం
చైతన్యరాజు తనయులు రవికిరణ్‌వర్మ, శశికిరణ్‌వర్మ తండ్రి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. రవికిరణ్ వర్మ ఉప్పలగుప్తం,అమాలాపురం మండలాల్లో పర్యటించి ఉపాధ్యాయులను ఓట్లు అభ్యర్థించారు. గైట్ ఎండీ శశికిరణ్‌వర్మ రాజమండ్రి, రాజమండ్రి రూరల్ మండలాల్లో పర్యటించి ఉపాధ్యాయుల మద్దతు కోరారు.
చైతన్యరాజును గెలిపించండి
Published Tue, Mar 17 2015 2:23 AM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM
Advertisement
Advertisement