
‘‘బళ్లారికి వచ్చి నా వద్ద డబ్బులు తీసుకున్నది వాస్తవం కాదా..? దేవుడి గుడిలో ప్రమాణం చేద్దామా..’’ అని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపిస్తే నీవు కిమ్మనలేదు. అంటే పార్టీ సిద్ధాంతాలు, ప్రజలను పట్టించుకోకుండా కుమ్మక్కు రాజకీయాలు చేశావు.
రాయదుర్గం: ‘‘నీవు రాజీనామా చేసి రా. నీపై బీసీ అభ్యర్థినే బరిలో దింపుతా, మా సహకారం లేకుండా గెలిచావనుకో.. నీవు గ్రేట్. నేను రాయదుర్గం వదిలి వెళ్లిపోతా. లేకపోతే నువ్వ వెళ్లిపోతావా. అందుకు సిద్ధమైతే.. రా తేల్చుకుందాం.’’ అంటూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మంత్రి కాలవకు సవాల్ విసిరారు. ‘‘నన్నూ, నా అనుచర వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నావు. మీలాంటి వారికి నేను భయపడే రకం కాదు.. ఇప్పటికైనా గ్రూపు రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అంటూ మంత్రిని హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన స్థానిక చేయూత చారిటబుల్ ట్రస్ట్‌లో విలేకరులతో మాట్లాడారు.
సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం కాలవకు టికెట్ ఇచ్చినా.. ఎలాంటి స్వార్థం లేకుండా తాము పార్టీ కోసం పనిచేసి, ఆయన్ను గెలిపించామన్నారు. ఇప్పుడేమో ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని దగ్గరకు తీసుకుని, పార్టీ కోసం పనిచేసిన సీనియర్లను ఇబ్బందిపెడుతున్నారన్నారు. దీపక్ రెడ్డి కనబడరాదు, ఫ్లెక్సీలు కట్టరాదు, ఆయన్ను మరిపించాలని మంత్రి కాలవ ముఖ్యమంత్రి ప్రోగ్రాంలో కుట్ర పన్నాడన్నారు. తాను టీడీపీ వ్యక్తిని కాదనేలా వ్యవహరిస్తున్నాడన్నారు. అయినా ప్రజల్లో దీపక్‌రెడ్డిని మరిపించడం మీ తాత తరం కూడా కాదన్నారు. ‘‘నేను టీడీపీ మనిషిని కాను అని చెప్పించగలవా? అలా చెప్పిస్తే నేను రాజీనామా చేసి, రాయదుర్గం వీడిపోతా. చెప్పించకపోతే నీవు రాజీనామా చేసి పోతావా? అంటూ కాలవకు సవాల్ విసిరారు.
నీముఖం మీదే చెప్పింది మరిచావా..?
ఎన్నికల ప్రచారంలో ఓటు అడగడానికి వెళితే.. దీపక్ రెడ్డి ముఖం చూసి ఓటేస్తామని ఆనాడు కార్యకర్తలు నీ ముఖం మీదే చెప్పడాన్ని మరచిపోయావా అని కాలవను ప్రశ్నించారు. తన వెంట తిరిగే స్టోర్ డీలర్‌ను తొలగించడం, 6ఏ కేసు బనాయించడం, పార్టీ సిద్ధాంతాలు వీడి డి.హీరేహాళ్ మండల ఎంపీపీని పదవి నుంచి దిగిపో అంటావా? అని దుయ్యబట్టారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ తిరిగి బలహీన పడుతోందనీ, 30 శాతం మంది కార్యకర్తలు మంత్రి పద్ధతి నచ్చక వైఎస్సార్సీపీలోకి వెళ్లాలని సిద్ధమైనా.. వారిని నివారించానన్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డిని, ఆయన అనుచరులను పక్కనపెట్టడం తగదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీనైన తనకు సమాచారం ఇవ్వవద్దని అధికారులకు చెబుతూ చిల్లర రాజకీయాలు చేయడం పద్ధతి కాదని కాలవకు సూచించారు. ఇప్పటికైనా మంత్రి తన విధానాలు మార్చుకోవాలి, లేకపోతే అసలు కథ ప్రారంభం అవుతుందన్నారు. ఇదే చివరి హెచ్చరిక అని...తాను చిట్టా విప్పితే తట్టుకోలేవని కాలవను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment