
పట్టణంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాల
నూజివీడు : ప్రభుత్వ పాఠశాలలకు స్కూల్ గ్రాంట్, టీచర్స్ గ్రాంట్లను టీడీపీ సర్కారు ఇప్పటికీ విడుదల చేయలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాఠశాల నిర్వహణకు నిధులను ఏటా సెప్టెంబరు నెలలో ప్రభుత్వం విడుదల చేస్తుంటుంది. అయితే ఈసారి జనవరి నెల సగం గడిచిపోయినా నిధుల విడుదల ఊసే లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నపాటి ఖర్చులకు కూడా నిధులు లేక ఉపాధ్యాయులు అల్లాడిపోతున్నారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయులే తమ జేబుల్లో డబ్బులు వేసుకుని ఖర్చులను భరిస్తున్నారు.
బోధనా సామగ్రికి కూడా..
బోధనకు అవసరమైన చాక్‌పీసులు, డస్టర్లు, బోధనా సామగ్రి, చిన్న చిన్న పనుల నిర్వహణ కోసం పాఠశాలలకు నిధులు అవసరం ఉంది. ఏటా సెప్టెంబరు నాటికే అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రభుత్వం విద్యా శాఖ ద్వారా మెయింట్‌నెన్స్ గ్రాంటు, స్కూల్ గ్రాంట్‌లను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. అలా జమ అయ్యిన నిధులను పాఠశాల నిర్వహణకు, బోధనా సామగ్రి కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ప్రాథమిక పాఠశాలలకు మెయింట్‌నెన్స్ కింద రూ.5 వేలు, స్కూల్ గ్రాంట్ కింద మరో రూ.5 వేలును ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలకు మెయింట్‌నెన్స్ గ్రాంటు కింద రూ.7 వేలు, స్కూల్ గ్రాంట్ కింద రూ.5 వేలు విడుదల చేస్తుంది. వీటిని చిన్న చిన్న పనులకు, సున్నం వేయించడానికి, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి, హ్యాండ్ బోర్లు, విద్యుత్ మోటర్లు రిపేరుకు వస్తే బాగు చేయించడానికి, చీపుర్లు కొనుగోలు చేయడానికి, స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే తదితర కార్యక్రమాల నిర్వహణకు వాడుతుంటారు. అలాగే పిల్లలకు పాఠాలు బోధించేటప్పుడు అవసరమైన బోధనోపకరణాల కొనుగోలుకు కూడా వీటిని వినియోగిస్తారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు అవుతున్నా ఇంత వరకు ఆ కొద్దిపాటి నిధులను విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మరో 3 నెలల్లో..
మరో మూడు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ నిధులు ఇవ్వకపోతే ఎలాగని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. నూజివీడు మండలంలో 94 పాఠశాలలు, చాట్రాయిలో 52, ముసునూరులో 67, ఆగిరిపల్లి మండలంలో 58 స్కూల్స్ ఉన్నాయి. వీటన్నింటికి నిధులు విడుదల కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తమ జేబుల్లో డబ్బులను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా స్కూల్ గ్రాంట్, మెయింట్‌నెన్స్ గ్రాంటులను విడుదల చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment