విశాఖ భూ కుంభకోణాల్లో విచారణ వైచిత్రి.. సూత్రధారులంతా అధికార పార్టీ నేతలే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ.. సమైక్యాంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏకైక పెద్ద నగరం.. ఫలితంగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ నేతల భూదాహం పరాకాష్టకు చేరింది. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, చుక్కల భూములు.. అన్న తేడా లేకుండా వేలాది ఎకరాలను అధికారం దన్నుతో అడ్డంగా ఆక్రమించేశారు. చివరికి హుద్‌హుద్ తుపాను విలయాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని భూములు కొల్లగొట్టేశారు. వీటిపై సాక్షిలో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేపట్టారు.
అయితే సూత్రధా రులైన టీడీపీ నేతల జోలికి వెళ్లే సాహసం చేయలేని రెవెన్యూ ఉన్నతాధికారులు.. రాజకీయ పలుకుబడి లేని ఇద్దరు తహసీల్దార్లను మాత్రం బలి చేశారు. లక్ష ఎకరాలకు చెందిన ఎఫ్‌ఎంబీలు మాయమైపోయాయని చెబుతు న్న అధికారులు ఆయా భూములు ఎవరి చేతుల్లో చిక్కుకున్నాయనే వాస్తవాలను మాత్రం వెల్లడించలేకపోతున్నారు. వందల కోట్ల విలువైన భూములు కాజేసిన టీడీపీ ప్రజాప్రతినిధులను పరిశీలిస్తే....
మంత్రి భూ దాహం రూ.600 కోట్లు
భీమిలి పరిసరాల్లో మంత్రి బినామీల పాగా
విశాఖ నగర శివారులో ఆర్ధిక నగరాలను నిర్మిస్తామని, ఇందుకోసం అసైన్డ్ భూములు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించి విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా) ఆధ్వర్యం లో ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రభుత్వం కొద్దికా లంగా ప్రకటిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఈ ప్రకటన చేయకముందే, వుడా ల్యాండ్ పూలిం గ్ పథకం అమలు ఊసెత్తకముందే జిల్లాకు చెందిన ఓ మంత్రి ముందస్తు వ్యూహరచన చేశారు. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్)డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని డీ పట్టా భూములకు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములకు ఎకరా రూ.3 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకున్నారు.
ఆ మేరకు రైతులకు అడ్వాన్సులుగా రూ. 2 లక్షల వరకూ చెల్లించి, క్రయ పత్రాలు రాయించుకున్నారు. వాటితో పాటు ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని వాటన్నిటినీ తమ వద్దనే ఉంచుకున్నారు. తర్వాత సదరు మంత్రి.. ప్రభుత్వంలో తన పరపతి ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రకటన చేయించారు. పూలింగ్‌లో భాగంగా వుడా.. రైతు వాటా కింద ఇచ్చే మొత్తాన్ని బినామీలే బొక్కేసి ఏడాది కితం అనుకున్న నామమాత్రపు సొమ్మును రైతుకు చెల్లించేస్తున్నారు. విశాఖ నగర శివారును మింగేస్తున్న ఈ భారీ భూ కుంభకోణం విలువ దాదాపు 600 రూ.కోట్ల పైమాటే.
ఎమ్మెల్సీ కబ్జా 35 ఎకరాలు
1976లో భూమిలేని పేదలకు సాగుచేసుకునే నిమిత్తం ఎండాడ, రిషికొండ పరిధిలోని సర్వే నెంబర్ 35, 37, 38ల్లో పట్టాలిచ్చారు. ఆ భూములపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యాపార వేత్త, ఎమ్మెల్సీ కన్నుపడింది. ఆ స్థలాలను తనకు కేటాయించాల్సిందిగా 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పేదల పక్షాన నిలచిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. విలువైన ఆ భూములపై కన్నేసిన టీడీపీ నాయకుడు.. వైఎస్ హఠాన్మరణం తర్వాత మళ్లీ ప్రతిపాదన లు పంపారు. అయితే ఈసారి అప్పటి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు అడ్డుకున్నారు.
ఆ తర్వాత 2012–13 మధ్య కాలంలో అప్పటి జిల్లా కలెక్టర్ శేషాద్రి ఆ ప్రతి పాదనలను జిల్లా స్థాయిలోనే అడ్డుకున్నారు. శేషాద్రి బదిలీ తర్వాత వచ్చిన అధికారులు మాత్రం సదరు టీడీపీ నాయకుడికి తలొగ్గారు. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన దరి మిలా అధికార యంత్రాంగం ఆ నేతకు పూర్తిగా దాసోహమంది. సర్వే నంబర్ 35లో రెండు ఎకరాల 6సెంట్లు, సర్వే నంబర్ 37లో 5ఎక రాల 14సెంట్లు, సర్వే నంబర్ 38లో 8ఎకరాల 44సెంట్లు మొత్తంగా 15ఎకరాల 64సెంట్ల భూమిని సదరు టీడీపీ నేతకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా స్థాయి నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఉన్నత స్థాయిల్లోనూ క్లియరెన్స్ వచ్చేసిందని, ఆ ఫైల్‌పై కేవలం సీఎం చంద్రబాబు సంతకమే మిగిలి ఉందని తెలుస్తోంది.
మాజీ మంత్రి భూదందా
పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో 2016లో జరిగిన ఏపీఐసీసీ భూముల సేకరణను తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదాయ మార్గంగా మలచుకున్నారు. పెందుర్తి మండలం ముదపాకలో దళిత రైతులకిచ్చిన అసైన్డ్ భూమిని కొట్టేసేందుకు ఈ మాజీ మంత్రి భారీ స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసేసుకుంటుందని,, అలా తీసుకుంటే ఎకరానికి రెండులక్షల కంటే పరిహారం రాదని దళిత రైతులకు చెప్పుకొచ్చాడు. అవే భూములు తమకిస్తే ఎకరానికి పదిలక్షలు ఇస్తామని అడ్వాన్స్‌లు ఇచ్చాడు. మాజీ మంత్రి మాటలు నమ్మిన 236మంది రైతులు 280 ఎకరాల భూమి రికార్డులను అప్పజెప్పేశారు. ఆ తర్వాత సదరు మాజీ మంత్రి వుడా ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకువచ్చి ఎకరానికి దాదాపు రూ. 2కోట్లకు పైగా కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశాడు.ఈ కుంభకోణం విలువ రూ. 500కోట్లపైనే ఉంటుందని అంచనా.
చుక్కల భూములపైనా కన్ను
స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దాంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారుల కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటన్నింటిని చుక్కల భూములుగా పిలుస్తారు. ఇలాంటి భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలుండగా, విశాఖలోనే మూడు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల హక్కులపై వివాదం నడుస్తోంది. ఈ వివాదం శాశ్వత పరిష్కారానికి శాసనసభలో బిల్లు తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఆయా భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఓ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి విశాఖ భూములను చక్కబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
1బీ రికార్డుల ట్యాంపరింగ్‌తోనూ
టీడీపీ ప్రజాప్రతినిధుల భూ దోపిడీకి రికార్డుల ట్యాంపరింగ్‌ను ఎంచుకున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా ఉన్న తహశీల్దార్లను పావులుగా వాడుకున్నారు. సదరు తహశీల్దార్లతో రికార్డుల ట్యాంపరింగ్ చేయించారు. ప్రధానంగా భూమి ధరలు ఆకాశాన్నంటిన విశాఖ రూరల్, గాజువాక, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోనే ప్రధానంగా రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. ప్రభుత్వ భూముల్ని ట్యాంపరింగ్ చేసి 1బీల్లో నమోదు చేయించేశారు. రికార్డుల్లో అసలు పేర్లు, చిరునామాలు గల్లంతు చేసి.. వేరే వాళ్ల ఫొటోలతో పట్టాలు తయారు చేశారు. అయితే ఇటీవల భూ కుంభకోణాలపై వరుస కథనాలు రావడంతో ట్యాంపరింగ్ బాగోతం బయటపడింది. దీంతో భీమిలి తహశీల్దార్ రామారావు, విశాఖ రూరల్ తహశీల్దార్ శంకరరావులపై సస్పెన్షన్ వేటుపడింది. వారిద్దరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టిన అధికారులు వారిని ఆడించిన టీడీపీ పెద్దల భాగోతాన్ని మాత్రం బయటపెట్టడం లేదు.
ఆక్రమణల చెరలో దస్‌పల్లా హిల్స్
విశాఖలోని దస్‌పల్లా హిల్స్‌లోని 62.97 ఎకరాల భూమిపై దస్‌పల్లా రాణి కమలాదేవికి, ప్రభుత్వానికి వివాదం నడిచింది. హైకోర్టులో రాణి కమలాదేవికి అను కూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఆలస్యంగా అప్పీలుకు వెళ్లకపోవడంతో కోర్టు తిరస్కరించింది. దీంతో టీడీపీకి చెందిన బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు సుమారు రూ.1500 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేశారు. ఈ భూముల్లోనే జిల్లా టీడీపీ కార్యాలయం కూడా ఉంది.
కొట్టుకుపోయిన భూ రికార్డులు
2014లో సంభవించిన హుద్‌హుద్ తుపానులో విశాఖ జిల్లా భీమిలి మండలంలో 4,500 ఎకరాలు, పెందుర్తిలో 3,500, అనకాపల్లిలో 6,500, యలమంచిలిలో 4,000, విశాఖ నగరంలో 300 ఎకరాల భూముల రికార్డులు అదృశ్యమైనట్టు అధికారులే ప్రకటించారు. మరి ఈ రెండున్నరేళ్ల కాలంలో రికార్డుల గల్లంతు గురించి ఏం చర్యలు తీసుకున్నారంటే మాత్రం రెవిన్యూ అధికారుల వద్ద సమాధానం లేదు.