సాక్షి, కందుకూరు (ప్రకాశం): నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి.. నువ్వు ఎన్ని ఓట్లు వేయిస్తావు.. దాని ప్రతి ఫలంగా నీ రేటు ఎంతో చెప్పు.. ఇదీ ప్రస్తుతం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయం. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్లో ఉన్న సానుభూతిని అడ్డుకునేందుకు సానుకూలతను అడ్డుకునేందుకు అధికార పార్టీ భారీ తాయిలాలు ప్రకటిస్తోంది. గ్రామాల వారీగా, పల్లెల వారీగా, నాయకుల వారీగా కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ నాయకుడి స్థాయిని బట్టి ప్యాకేజీ ఆఫర్ చేస్తూ తమవైపు తిప్పుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రలోభాలు, తాయిలాలకు అడ్డే లేకుండా పోతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అధికార పార్టీ నేతలు బరితెగించి మరీ ఇలా డబ్బులు పంపకం చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతల డబ్బుల ప్రవాహాన్ని ఎన్నికల అధికారులు అడ్డుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ప్రలోభాలకు తెరతీసిన టీడీపీ..
నియోజకవర్గంలో ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల ప్రకటన పూర్తి అయింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి బరిలో ఉంటే, తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్యే పోతుల రామారావు బరిలో ఉన్నారు. దీంతో గెలుపుకోసం ఇరువురు తీవ్రస్థాయిలోనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అత్యంత బలంగా ఉండడం, కచ్చితంగా విజయం సాధిస్తుందనే ప్రచారంతో అధికార పార్టీ అధికార పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. అదే సందర్భంలో అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు, నాయకుల మధ్య కుమ్ములాలటు, అసంతృప్తులతో పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. అభ్యర్థి ప్రకటన పూర్తయితే, ఎన్నికలు సమీపిస్తున్నా టీడీపీలో నెలకొన్న పరిస్థితిలో మాత్రం మార్పురావడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఎలాగైనా పట్టునిల్పుకునేందుకు అధికార పార్టీ ప్రలోభ రాజకీయాలకు తెరలేపింది. భారీగా డబ్బులు ఎరవేసి పార్టీలోని అసంతృప్తులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా రాజకీయాలు నియోజకవర్గంలో ఊపందుకున్నాయి. మొదట పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులను గుర్తించి వారికి ఏం కావాలో అడడగం, వారి డిమాండ్ చేసిన మేరకు డబ్బులు ముట్టజెప్పడం చేస్తున్నట్లు సమాచారం.
నాయకుడి స్థాయిని బట్టి..
తరువాత గ్రామాల్లో కాస్త ఓటర్లను ప్రభావితం చేసే నాయకులను గుర్తించి వారిని తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా నాయకుడి స్థాయిని బట్టి రూ. 20వేల నుంచి రూ.50వేల వరకు ఒక్కొక్క నాయకుడికి ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయినా సరే కొందరు నాయకులు ఈ డబ్బులు తీసుకునేందుకు కూడా నిరాకరిస్తున్నట్లు సమాచారం. గత ఐదు సంవత్సరాలుగా తమను పట్టించుకోకుండా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో, ఎన్నికల్లో గెలిచేందుకు భారీగా డబ్బులు ఆశ చూపడం ఎంతవరకు కరెక్టు అని ఆ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో గ్రామాల్లోను భారీగా ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు అధికార పార్టీ నాయకులు ప్రారంభించారు. గ్రామాలు, పల్లెల లెక్కన బేరాలు పెడుతూ మీకు ఎంత కావాలో చెప్పండి అనే తరహాలో విచ్చలవిడి ప్రలోభాలకు తెరలేపారు. దీంతో ప్రస్తుతం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఈ ధర రాజకీయాలపైనే చర్చ జరుగుతుంది. అధికార పార్టీ నాయకుల ప్రలోభాలు, ప్రకటిస్తున్న తాయిలాల గురించి ముచ్చటించుకుంటున్నారు.
ఓటమి భయంతోనే...
నియోజకవర్గంలో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ ఇటువంటి తాయిలాలకు, ధన రాజకీయాలకు తెరలేపింది. వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యే పోతుల రామారావు రెండు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు నియోజకవర్గంలో పెత్తనం చేసిన దివి శివరాం వర్గానికి, పోతుల వర్గానికి మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి తారాస్థాయికి చేరి నియోజకవర్గంలో పార్టీ బలహీన పడేలా చేశాయి. కొందరు ముఖ్య నాయకులు సైతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందర పార్టీలోనే ఉన్న బహిరంగంగానే పోతుల రామారావుకు సహకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇలా దివి శివరాంకు సొంత సొదరులైన మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్యనాయుడు, ప్రసాద్ వంటి వారు ఉన్నారు. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య సయోధ్య కుదరక పార్టీలో అంతర్గత విబేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో నియోజకవర్గంలో పార్టీలో గెలుపుపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకలు ఆశలు వదులుకున్నారు. దీంతో అధికార పార్టీ నాయకులు దీన్ని కప్పి పుచ్చుకునేందుకు భారీ స్థాయిలో తాయిలాలకు తెరలేపారు.
ఉత్సాహంతో వైఎస్సార్‌సీపీ....
అదే సందర్బంలో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అత్యంత పటిష్టంగా ఉండడంతో ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అధికార పార్టీ ఎన్ని తాయిలాలు ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేస్తున్నారు. అలాగే అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపధ్యంలో ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీ బాట పట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధికార పార్టీ నుంచి వలసలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ గెలుపుపై ధీమాతో ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment