
భీమవరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్న మునిసిపల్ సిబ్బంది
పశ్చిమగోదావరి , భీమవరం: అధికార పార్టీ ఆర్భాట ప్రచారం పట్ట ణాలు, గ్రామాల్లో మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. విచ్చల విడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీటిని తొలగించాల్సిన బాధ్యత సిబ్బందిపై పడింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది ప్రజావసరాలు తీర్చే పనులను పక్కన పెట్టి ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించే చర్యలు చేపట్టారు.
అడుగడుగునా అధికార పార్టీ ఫ్లెక్సీలు
టీడీపీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రజలను ఆకట్టుకోవడానికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో తెలుగుతమ్ముళ్లు తామేమీ తక్కువ కాదంటూ పుట్టినరోజులు, పండుగల పేరుతో పట్టణాలు, గ్రామాల్లో అడుగడుగునా ఫ్లెక్సీలు, బ్యానర్లు కడుతున్నారు. దీనిలో భాగంగా ఇతరులు తమతో పోటీ పడకుండా ఉండడానికి ఇతర నాయకులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దీనిలో భాగంగానే పాలకొల్లు పట్టణంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు ఫ్లెక్సీలు కట్టకుండా అడ్డుకున్నారంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు వెళ్లింది. ఒక్క పాలకొల్లులోనే కాకుండా ఇటువంటి వివాదాలు జిల్లా వ్యాప్తంగా అనేకం చోటుచేసుకున్నాయి. నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి పన్ను చెల్లించకుండా ఇష్టం వచ్చినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ నాయకుల మన్ననలు పొందేం దుకు పాకులాడుతున్నారు. విచ్చలవిడిగా ప్రధాన కూడళ్లు, రోడ్లు వెంబడి,రోడ్డు మలుపుల్లోను ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడడంతో ఎదరు వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
తొలగింపు భారం ప్రజలపైనే
రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, చోటా మోటా నాయకులు తమ అవసరాలకు, ఆర్భాటాలు, పేరు ప్రతిష్టల కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా పూర్తిగా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో రెండు రోజులుగా మునిసిపల్, పంచాయతీ సిబ్బంది ఇతర పనులను పక్కన పెట్టి మరీ వీటిని తొలగించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. అలాగే కొన్ని చోట్ల ఏర్పాటు చేసిన దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. తొలగించిన ఫెక్సీలు, బ్యానర్లను తరలించడానికి మునిసిపాల్టీలు ,పంచాయతీలు ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. ప్రజల అవసరాలు తీర్చాల్సిన సిబ్బంది రాజకీయ నాయకుల ఆర్భాటాల కోసం ఏర్పాటుచేసినవాటిని తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేసే వారి నుంచే ఖర్చును రాబట్టే చర్యలు తీసుకుంటే ఇష్టారాజ్యంగా కట్టేవారు అదుపులో ఉంటారని, అలా కాకుండా ప్రభుత్వ సిబ్బంది తొలగించడం వల్ల ఫ్లెక్సీలు, బ్యానర్లు తిరిగి దర్శనమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సిబ్బందికి ప్రాణ సంకటం
ఫ్లెక్సీలను విద్యుత్ తీగల దగ్గర, కాలువలు, డ్రెయిన్లు వెంబడి ఎతైన ప్రదేశాల్లోను ఏర్పాటు చేయడంతో వాటిని తొలగించడానికి సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫ్లెక్సీలకు ఐరన్ గొట్టాలు వాడడం వల్ల పొరపాటున విద్యుత్ తీగలపై పడితే పెను ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే భారీ ఫ్లెక్సీలను ఎతైన ప్రాంతం నుంచి కిందకు దించడం, కాలువలు, డ్రెయిన్ల పక్కన తొలగించే సమయంలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment