నచ్చినోళ్లకు నచ్చినట్టుగా.. | tdp play politics in cyclone hudhud rehabilitation | Sakshi
Sakshi News home page

నచ్చినోళ్లకు నచ్చినట్టుగా..

Published Fri, Oct 17 2014 1:20 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఆహార పొట్లాల కోసం విశాఖలోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రజల పడిగాపులు - Sakshi

ఆహార పొట్లాల కోసం విశాఖలోని టీడీపీ కార్యాలయం వద్ద ప్రజల పడిగాపులు

* సాయం పంపిణీలోనూ రాజకీయాలు
* పెత్తనమంతా ఎమ్మెల్యేలదే..
* అధికారుల ప్రేక్షకపాత్ర
* బాధితుల ధర్నా
 
సాక్షి, విశాఖపట్నం: ‘అడుక్కొని తెచ్చి పిల్లలకు అన్నం పెడుతున్నా.. తుపానొత్తందని మూడురోజులు ముందరగానే మమ్మల్ని ఈ గల్లీ బడిలో పడేశారు. తుపానులో మా కొంప పూర్తిగా ఎగిరిపోయింది. గోడలు కూడా మిగలలేదు. ఇక్కడకు వచ్చి ఏడు రోజులైనాది.. ఏ అధికారి.. ఏ నాయకుడు మా వైపు తొంగి చూడలేదు. మమ్మల్ని పత్తించుకోలేదు. ఉన్నామా? తిన్నామా? చచ్చామా? అని అడిగేవారే లేరు. ఈ గల్లీబడిలో తిండితిప్పల్లేక ఇలాగే ఉంటున్నాం. వారం రోజులుగా పనుల్లేవు. మేమెలాగూ పత్తులుంటున్నాం.

పిల్లలు ఆకలేత్తందంటే వారిని చూడలేక చుట్టుపక్కల వార్ని కాస్త అన్నం పెట్టమని అడుక్కొని తెచ్చి పెడుతున్నాం. పులోరపొట్లాలిత్తున్నారు. అవి కూడా తెలుగుదేశపోళ్లు తమకు నచ్చిన వారికే ఇత్తున్నారు. నచ్చనోళ్లకు ఇవ్వడం లేదు. మేమేం పాపం చేశాం. మమ్మల్ని ఎందుకు పత్తించుకోవడం లేదో అర్ధం కావడం లేదు. మాకెందుకీ పరిస్థితి. మా కొంపతో పాటు మేము కూడా కొట్టుకుపోయి ఉంటే బాగుండేది..’ అంటూ వాసువానిపాలెం ప్రాథమిక పాఠశాల (గల్లీబడి)లోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న మహిళ ఎస్.పద్మ కన్నీరుమున్నీరైంది.

విశాఖ నగరంలోని పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారే కాదు.. తుపాను బాధితులంతా ఇదేరీతిలో గొల్లుమంటున్నారు. సాయం కోసం నిరుపేద బాధితులు గురువారం విశాఖపట్నం ఊటగెడ్డ వద్ద నడిరోడ్డుపై ధర్నాకు దిగడం పరిస్థితికి అద్దంపడుతోంది. సీతమ్మధార, మర్రిపాలెం, అక్కయ్యపాలేల్లో కూడా ఆందోళనలు జరిగాయి.

అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం వల్ల ఆహార పొట్లాలే కాదు.. నిత్యావసర సరుకులు ఎక్కడికక్కడ తుపాను బాధితులకు అందకుండా పక్కదారి పడుతున్నాయి. అధికారులు ఉన్నతాధికారుల సేవలోను, ఆ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి సేవలోను తరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో సహాయ చర్యలను పర్యవేక్షించే వారే లేకుండాపోయారు. ఆహారం, నిత్యావసరాల పంపిణీ బాధ్యతలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు తమ చేతుల్లోకి తీసుకుని తమ అనుచరుల ద్వారా పంపిణీ చేయిస్తున్నారు.

అధికారులు పైపైన పర్యవేక్షణకే పరిమితమవుతున్నారు. ఆహార పొట్లాలు, నిత్యావసరాలు, కూరగాయలు ఇలా ప్రతి దాన్లోను ఎమ్మెల్యేల జోక్యం శృతిమించుతోంది. ఎక్కడా తమకు తెలియకుండా పంపిణీ చేయడానికి వీల్లేదంటూ అధికారులను ఆదేశిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమ అనుచరులద్వారా  గడిచిన ఎన్నికల్లో తమకు ఓట్లు వేసిన వారికి, తమకనుకూలంగా ఉన్నవారికి, తమకు నచ్చిన ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేస్తూ మిగిలిన వారిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొండవాలు ప్రాంతాలైన వెంకోజుపాలెం, వాసువానిపాలెం, హనుమంతవాక, పెద్దగదులు, రెల్లివీధి, ఊటగెడ్డ, జాలరిపేటల్లో బాధితులకు అరకొర సాయమే అందుతోంది. ముఖ్యంగా పునరావాసకేంద్రాల్లో ఉన్న వారికి సాయం పంపిణీ జరగకపోవడంతో వారు కూలిపోయిన ఇళ్లమధ్యే కాలం గడుపుతున్నారు. వాసువానిపాలెం, శివగణేష్‌నగర్, ఆరిలోవ, రామకృష్ణాపురం, ఆదర్శనగర్, సాగర్‌నగర్, జాలరిపేటల్లో ఎమ్మెల్యేలు తమ అనుచరుల ద్వారా చేస్తున్న సహాయ చర్యలు పక్కదారిపడుతున్నాయి.

కుటుంబానికి ఉచితంగా పంపిణీ చేయదల్చిన 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసరాలు ఎమ్మెల్యేల అనుచరులు పంపిణీ చేయకుండానే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలున్నాయి. రేషన్ షాపుల వద్ద ఎమ్మెల్యేల అనుచరులు మకాం వేసి మరీ పంపిణీని పర్యవేక్షిస్తున్నారు. పార్టీ పంపిణీ చేస్తుందా? లేక ప్రభుత్వం పంపిణీ చేస్తుందా? పర్యవేక్షించడానికి వీరెవరంటూ ఎంవీపీ కాలనీలో టీడీపీ నాయకుల తీరుపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పంపిణీ చేస్తున్నదీ లేనిదీ చూస్తే తప్పేమిటంటూ తెలుగుదేశం నేతలు ఎదురు ప్రశ్నిస్తుంటే.. ఆ పని అధికారులు చేస్తారు కదా మీకెందుకంటూ బాధితులు నిలదీస్తున్నారు.

టీడీపీ కార్యాలయం సమీపంలోని ఊటగెడ్డ వద్ద సాయం అందడం లేదంటూ బాధితులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఎందుకు మా పట్ల వివక్ష చూపుతున్నారు.. మాకెందుకు సాయం పంపిణీ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయం పంపిణీ చేసే ప్రతిచోట ఇలాంటి సంఘటనలు కనిపిస్తున్నాయి. మత్స్యకార ప్రాంతాలు, మురికివాడల్లోనే పంపిణీ నామమాత్రంగా జరుగుతోంటే, మధ్య తరగతి, ఎగువమధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాల్లోని బాధితుల వైపు అసలు చూడటమే లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement