* విశాఖ గాంధీనగర్‌లో 100 కుటుంబాల గోడు
* జగన్‌కు మొరపెట్టుకున్న హుదూద్ బాధితులు
* లక్ష కోట్ల బడ్జెటున్నా సాయానికి చెయ్యి రాలేదా?
* టీడీపీ సర్కారు తీరుపై ధ్వజమెత్తిన జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఐదు రోజులుగా 100 కుటుంబాల వాళ్లం రోడ్డు పక్కన ఈ చెట్టు కిందే పడి ఉన్నాం. పగలు ఎండలో, రాత్రి చీకట్లో చస్తూ బతుకుతున్నాం. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పక్కనున్న అపార్టుమెంట్లకు వెళ్లి అడుక్కుని వచ్చి పిల్లలకు పెడుతున్నాం. పెద్దలమైతే పస్తులే ఉంటున్నాం. పక్కనున్న ఈ రోడ్డు మీద నుంచే మినిస్టర్లు, అధికారులు వెళ్తున్నారు. మా దగ్గరికి ఒక్కరూ రాలేదు. మేం బతికున్నామో చచ్చామో కూడా చూడటం లేదు. జగన్‌బాబూ! నువ్వైనా వచ్చావు. మాకు కాస్త న్యాయం చెయ్ బాబూ... నీకు పుణ్యం ఉంటుంది’’ ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో విశాఖలోని హుదూద్ తుపాను బాధితులు వ్యక్తం చేసిన ఆవేదన!
వై.ఎస్.జగన్ శుక్రవారం విశాఖ ఉత్తర, పశ్చిమ, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల పరిధిలోని కంచరపాలెం మెట్టులోని గాంధీనగర్, సాకేతపురం కాలనీ, స్టీల్‌ప్లాంట్, ఇస్లాంపేట, బర్మాకాలనీ, దయాళ్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు.కాలినడకన కలియదిరిగి బాధితులందరినీ పరామర్శించారు. ఈ సందర్భంగా కంచరపాలెం గాంధీనగర్‌కు చెందిన కోలా కాసులమ్మ, ఆసనాల గౌరి తమ గోడును ఆయనతో వెళ్లబోసుకున్నారు. వారి దీనస్థితి చూసి జగన్ చలించిపోయారు.
ప్రభుత్వం వద్ద రూ.లక్ష కోట్ల బడ్జెట్ ఉన్నా బాధితులకు సహాయం చేయడానికి చేయి రావ డం లేదని మండిపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేవరకు పార్టీ తరఫున పోరాడతామని చెప్పారు. తాత్కాలికంగా పార్టీ తరఫున సాయం చేస్తామంటూ భరోసానిచ్చి వారికి ధైర్యం చెప్పారు. తాగునీటికి కూడా అల్లాడుతున్న మురికివాడలు, రాజకీయ కక్షసాధింపుతో సర్కారు సహాయం నిరాకరించడంతో దిక్కుతోచని స్థితిలోపడిపోయిన ముస్లిం మైనార్టీలు తదితర వేలాదిమంది బాధితులను కూడా జగన్ పలకరించారు. ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడారంటే...
* బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. వెయ్యి కుటుంబాలు ఉన్న కాలనీలోకి రాత్రిపూట లారీల్లో వచ్చి 200 పులిహోర ప్యాకెట్లు విసిరేసి వెళ్లిపోతున్నారు. అది కూడా పాచిపోయి తినేందుకు పనికిరావడం లేదు. రూ.10పులిహోర, రూ.14 అర లీటరు పాలు ఇచ్చేసి... ఏదో సహాయం చేశామన్నట్టుగా ప్రభుత్వం మీడియా స్టంట్లు చేస్తోంది.
* లక్షలాదిమంది రోడ్డున పడ్డారు. తిండి లేదు. ఇల్లు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. పనికీ దిక్కు లేదు. అల్లాడుతున్నా ఇంతవరకూ ఒక్కరూ పలకరించింది లేదు, దమ్మిడీ సాయం చేసిందీ లేదు. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ బాధితులు ఇదే మాట చెబుతున్నారు.
* ప్రభుత్వం మేల్కోవాలి. ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.5 వేలివ్వాలి. స్వల్పంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50వేలు ఇవ్వాలి. బాగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలి. గంటకు 250 కి.మీ. వేగంతో వీచే గాలులను తట్టుకునేలా అధునాతన పరిజ్ఞానంతో ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఒక్కో ఇంటికి రూ.1.5 అయినా, రూ.2.5 లక్షలైనా భరించాలి.
5 రోజులుగా చెట్టుకిందే ఉంటున్నాం
Published Sat, Oct 18 2014 12:39 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement