* ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ భరోసా
* రాష్ట్రానికి తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు
* ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
* పంటల బీమా చెల్లింపులోసానుభూతి చూపాలని కంపెనీలకు చెబుతా
* టెక్నాలజీ సహాయంతోప్రాణ నష్టం బాగా తగ్గించారు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేశాయి
* విశాఖను చూస్తే బాధేస్తోంది
* మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వే ల కేంద్ర సహాయం
విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: హుదూద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు తక్షణ సహాయంగా రూ.1,000 కోట్లు అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ 50 వేలు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. నష్టంపై సమగ్ర సర్వేలు చేయించి ప్రజలను అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
దక్షిణ ఒడిశాలో తుపాను ప్రభావిత ప్రాం తాల్లో మంగళవారం ఏరియల్ సర్వే జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావానికి కకావికలమైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే జరిపారు.
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తుపాను ఫొటోల ప్రదర్శనను తిలకించారు. తుపాను సమీక్ష అనంతరం ప్రధాని మోదీ విలేకరులతో మాట్లాడారు. తుపాను బాధిత ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తాయనీ, ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భీకరమైన తుపాను ప్రభావాన్ని స్వయంగా అనుభవించిన విశాఖ ప్రజలు నిబ్బరంగా ఉన్నారనీ, సహాయక చర్యల్లో పాల్గొం టున్న ప్రజలు, అధికారులను ఆయన అభినందించారు.
ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ఇటీవల వచ్చిన హుదూద్ పెనుతుపాను ఆంధ్రాతో సహా ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో విలయం సృష్టించింది. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలపై సానుభూతి ప్రకటిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా సహకారాన్ని అందిస్తుంది. ఈ తుపానును ఎదుర్కోవడంలో సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో వినియోగించారు. పొంచి ఉన్న తుపాను ముప్పును వాతావరణశాఖ ముందుగానే గుర్తించి ఈనెల 6వ తేదీ నుంచే సమాచారాన్ని అందించింది. ఊహించిన దిశ, సమయంలోనే తుపాను తీరం దాటింది. ఫలితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో సఫలమయ్యాం.
కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం భుజం భుజం కలిసి పనిచేస్తే, సరైన మార్గంలో వెళితే ఎంతటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు. ఏపీ ప్రభుత్వం, కేంద్రం ఐదు రోజులపాటు నిరంతరం.. మినిట్ టు మినిట్.. పూర్తిస్థాయిలో సమన్వయంతో పనిచేశాయి. స్థానిక సంస్థలు కూడా పూర్తిస్థాయిలో కలిసి నడిచాయి. విపత్తు సమయంలో ప్రభుత్వ సూచనలను పాటించిన వైజాగ్ ప్రజలను అభినందిస్తున్నా. క్రమశిక్షణతో సూచనలు పాటించడంవల్లే ప్రజల ప్రాణాలను కాపాడటంలో మేం సఫలమయ్యాం. విపత్తులో ధైర్యం కోల్పోకుండా భయంకరమైన తుపానును మీరు(ప్రజలు) ఎదుర్కోగలిగారు.
నేను చాలా దూరం వెళ్లాను. ఏరియల్ సర్వే చేశాను. ఒడిశా ప్రాంతాలను కూడా చూశాను. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. కోస్ట్‌గార్డు, నేవీ, రైల్వే, ఎయిర్‌లైన్స్, జాతీయ రహదారులు.. అన్నిటికీ నష్టం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు, సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంకోసం కేంద్రం నుంచి అధికారులు వచ్చి సర్వే చేస్తారు. రైతులకు పంట చేతికొచ్చే సమయం ఇది. తుపానువల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనా, నష్టపరిహారం చెల్లింపు విషయంలో సానుభూతితో వ్యవహరించాలని బీమా కంపెనీలతో మాట్లాడతాను.
ఇక ప్రైవేటు బీమా కంపెనీల ప్రతినిధులు బాధితులతో సమావేశమై వారి క్లెయిములను త్వరగా చెల్లించే దిశగా పనిచేయాలని బీమా కంపెనీలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థను చూస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏపీ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం. ఇప్పటికే చాలా పనులు చేయాల్సి ఉంది. ఇంతలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చింది. మరోవైపు వైజాగ్‌ను స్మార్ట్ సిటీ చేయాలన్న కలతో నేను చాలా ఆనందపడ్డాను. ఊహించని విధంగా కష్టాలు వచ్చాయి.
ఈ విపత్తు నుంచి బయటపడతామనే నమ్మకం నాకుంది. అతి త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. నష్టాలను సరిచేసుకోడంలో సఫలం అవుతాం. విద్యుత్, తాగునీరు, సమాచార వ్యవస్థల పునరుద్ధరణ ప్రాధాన్యత ఇచ్చాం. కొన్ని గంటల్లోనే పరిస్థితులు మెరుగవుతాయి. దీని కోసం కేంద్రం నుంచి ప్రతినిధులను ప్రత్యేకంగా విపత్తు సర్వే పనుల కోసం డిప్యూట్ చేశాను. ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో పనిలో నిమగ్నమైంది. ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చే దిశగా పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా పూర్తి స్థాయిలో పునరుద్ధరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
భారీ విపత్తు నుంచి కోలుకోవడానికి కేంద్రం తరపున మధ్యంతర సహాయం కింద రూ. 1000 కోట్లు సహాయం ప్రకటిస్తున్నా. ఇక ముందు కూడా ఏపీ, వైజాగ్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుంది. సమస్యల నుంచి బయటపడటానికి ఎలాంటి సహాయం చేయడానికైనా కేంద్రం సిద్ధంగా ఉంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు సాయం అందిస్తాం.
తుపాను నష్టంపై ప్రధాని సమీక్ష
హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్రం నుంచి రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించారు. తుపాను నష్టంపై విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ప్రధాని సమీక్ష జరిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అశోక్ గజపతిరాజు, డిప్యూటీ సీఎంలు చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, రాష్ట్ర మంత్రులు, అధికారులు ప్రధాని సమీక్షలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో తుపాను విధ్వంసం కారణంగా జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారు.
విశాఖపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు భారీగా నష్టం జరిగిందని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్య లు చేపట్టడానికి రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి అధికారులు, ఉద్యోగులను రంగంలోకి దించామని తెలిపారు. తనతోపాటు మంత్రులు సైతం ఇక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మంగళవారం రాత్రికి విశాఖలో అత్యవసర సర్వీసులకైనా విద్యుత్ సరఫరా జరపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగరంలో పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు ప్రధానికి తెలిపారు.
విశాఖ విషాదం అందరిదీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రధాని మోదీ
రాష్ట్రంలో తుపాను నష్టం పరిశీలనకు ఏరియల్ సర్వే కోసం మంగళవారం విశాఖకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం లో ప్రయాణించి విశాఖపట్నంలో సంభవించి న తుపాను విధ్వంసాన్ని స్వయం గా చూశా రు. ఈ సందర్భంగా విశాఖ విషాదం అందరిదీనని, నగరం త్వరగా కోలుకునేందుకు చేయూతనందిస్తామని సీఎం చంద్రబాబుకు హామీ ఇచ్చారు. విమానాశ్రయం నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఒకే వాహనంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ప్రధాని విశాఖ రోడ్లపై కుప్ప కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, తీగలను చూసి నష్టం పెద్దదని వ్యాఖ్యానించారు.
తుపాను బాధిత ప్రజలను కూడా సమీకరించి త్వరితగతిన కోలుకునేలా చేద్దామని చంద్రబాబుకు చెప్పారు. ‘విశాఖనగరాన్ని వీలైనంత త్వరగా పూర్వ స్థితికి తెచ్చేందుకు బ్లూప్రింట్ తయారు చేయాలని ప్రధాని సూచించారు. అదేవిధంగా తగిన ప్రతిపాదనలతో వస్తే విశాఖ పునరుద్ధరణకు సహకరిస్తానని మోదీ చెప్పారు. కాగా, ప్రధాన మంత్రి తొలిసారి కలెక్టరేట్‌కు వచ్చి తుపానుపై సమీక్ష నిర్వహించడం ఇదే ప్రథమం. మరోపక్క ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఆ మమకారాన్ని నిలుపుకుందాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ప్రజలు కేంద్రంపై, తనపై చూపిన మమకారాన్ని నిలుపుకోవాలని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మంగళవారం విశాఖలో పలు ప్రాంతాలను రోడ్డు మార్గంలో సందర్శించినప్పుడు ప్రజలు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతూ మోదీకి జయజయధ్వానాలు పలికారు. పర్యటన అనంతరం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ప్రధాని ఈ విషయం ప్రస్తావించారు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ప్రజలు తమ గోడు వినిపిస్తూ ఆందోళన చేస్తుంటారని గుర్తుచేశారు. కానీ విశాఖ ప్రజలు అందుకు భిన్నంగా స్వాగతం పలకడంపట్ల ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తుపానుకు ముందు, అనంతరం కేంద్రం, రాష్ట్రం అప్రమత్తంగా ఉండడంతో ప్రజల్లో విశ్వాసం కలిగిందని వెంకయ్య చెప్పారు. ప్రధాని మీద ఉన్న నమ్మకం కూడా వారి మమకారానికి కారణమన్నారు. దీంతో ప్రధాని తిరిగి ‘ఆ విశ్వాసాన్ని, వారి మమకారాన్ని మనం నిలుపుకోవాలి..’ అని వెంకయ్యనాయుడితో చెప్పారు.
అండగా ఉంటాం
Published Wed, Oct 15 2014 12:39 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement