సోషల్ మీడియాను వాడుకుంటున్నాం
రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం హుదూద్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు బయల్దేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అంతకు ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి ఆహారపు పొట్లాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా అందచేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఒకవేళ నేరుగా అందచేయటానికి వీలుకాకుంటే హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. సహాయక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. మొట్టమొదటిసారిగా ప్రకృతి వైపరీత్యాలపై ప్రభుత్వం ఫేస్బుక్లో ఓ పేజీ క్రియేట్ చేస్తే గూగుల్, ఫేస్బుక్లు ప్రమోట్ చేశాయన్నారు. పునరావాస కార్యాక్రమాల బాధ్యతను ఐఏఎస్ అధికారి సాయిప్రసాద్కు అప్పగించినట్లు తెలిపారు. విద్యుత్ పునరుద్దరణపై పియూష్ గోయల్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. నష్టాన్ని ఏ,బీ,సీ కేటగిరిల కింద విభజిస్తామన్నారు. ఒడిశా, తెలంగాణ పవర్ గ్రిడ్ల నుంచి విద్యుత్ను వాడుకుంటామన్నారు.