రాజమండ్రి : విశాఖ జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత రాత్రి విశాఖ బయలుదేరిన ఆయన రోడ్డుమార్గం దెబ్బతినడంతో రాజమండ్రిలో బస చేశారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, కూలిన చెట్ల తొలగింపు, రహదారుల మరమ్మతుకు నేటి నుంచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగనున్నట్లు ప్రకటించారు.
విద్యుత్, కమ్యూనికేషన్లు, రోడ్లు పునరుద్ధరించడంతోపాటు.. బాధితులకు ఆహారపదార్ధాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడే మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సమాచారం. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ..తక్షణ సాయం క్రింద 2వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు. కాగా హుదూద్ ప్రభావంతో భారీ వర్షాలకు రాష్ట్రంలో అయిదుగురు మృతి చెందారు.
పరిస్థితి మెరుగుపడేవరకూ విశాఖలోనే మకాం
Published Mon, Oct 13 2014 8:45 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement