ఆ ప్రకటన కోసం నిరీక్షణ
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: అధికారం కోసం టీడీపీ చేసిన ఒకే ఒక్క ప్రకటన రైతులను, డ్వాక్రా మహిళలను, బ్యాంకర్లను అయోమయానికి లోనుచేస్తోంది. వ్యవసాయ రుణాలతోపాటు డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామంటూ ఎన్నికల వేళ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ నేపథ్యంలో బకాయిలు, వాయిదాల చెల్లింపులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. డ్వాక్రా మహిళలు బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తాము అధికారంలోకి రాగానే రద్దు చేసేస్తామని టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడి ఇరవై రోజులు గడిచింది. ఎప్పుడు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారా... దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందా అన్న ఆశతో మహిళలు ఎదురు చూస్తున్నారు. అయితే రుణాలు రద్దవుతాయా..? ఎప్పటి నుంచి అమలు చేస్తారు.. ఎలా అమలు చేస్తారు..? ఇలాంటి సందేహాలు అందరిలోనూ ఉత్పన్నమవుతున్నాయి. గ డచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 71,418 స్వయం సహాయ సంఘాలకు రూ. 1,402 కోట్ల రుణాలను వివిధ బ్యాంకులు మంజూరు చేశాయి.
వాటికి సంబంధించి డ్వాక్రా సంఘాలు నెలనెలా వాయిదాలు చెల్లించాలి. ఫిబ్రవరి వరకు సక్రమంగా చెల్లించినా ఆ తర్వాత నుంచి వాయిదాలు కట్టడం నిలిచి పోయింది. దీంతో పలుమార్లు బ్యాంకు అధికారులు రుణాలు చెల్లింపునకు యానిమేటర్లపైనా, ఇందిరా క్రాంతి పథం అధికారులపైనా ఒత్తిడి తీసుకువచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో జిల్లా స్థాయి సమావేశంలో డీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తీసువెళ్లారు. డ్వాక్రా రుణాల మాఫీ అవుతాయో లేదో తెలియక డ్వాక్రా సంఘాలు, రుణాలు చెల్లింపులు జరగక బ్యాంకులు అయోమయ స్థితిని ఎదుర్కొంటున్నాయి.
కొత్త రుణాలకు మోకాలడ్డు.: రుణాలు సక్రమంగా చెల్లించిన డ్వాక్రా సంఘాలకు వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. చెల్లింపులు నిలిపి వేయటంతో వడ్డీ కూడా ప్రభుత్వం నిలిపి వేసింది. వసూలు దాదాపు నిలిచి పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకులు కొత్త రుణాల మంజూరుకు మోకాలడ్డుతున్నాయి. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణం మంజూరు చేస్తామంటూ బ్యాంకు అధికారులు ఇందిర క్రాంతి పథం అధికారులు తేల్చి చెబుతున్నారు. రుణమాఫీ జరగాలి లేదా రుణ వాయిదాలు చెల్లించాలి అప్పుడు మాత్రమే కొత్త రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది.