మేనిఫెస్టో పీకి పారేశారు!!
ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఎన్నికల మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్ లాంటిది. దాని ఆధారంగానే తర్వాతి కాలంలో చేపట్టే కార్యక్రమాలు, ఒకవేళ అధికారంలోకి వస్తే అందులో ఇచ్చిన హామీలు అమలుచేయడం లాంటివి చేస్తుంటారు. పార్టీ నాయకులందరూ దాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుఆయుడు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ప్రకటించి పారేశారు. వాటిని మేనిఫెస్టోలలో కూడా ప్రకటించారు. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు రెండు వేర్వేరు మేనిఫెస్టోలు ప్రకటించారు.
కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ మేనిఫెస్టోలను పట్టించుకోవడమే మానేశారు. రుణమాఫీ లాంటి హామీలను తప్పించుకోడానికి రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఉద్యోగ కల్పన లేదా నిరుద్యోగ భృతి అయితే అసలు జాడే లేదు. ఇవన్నీ చాలవన్నట్లు తాజాగా.. తెలుగుదేశం పార్టీ ఏకంగా తమ పార్టీ అధికారిక వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోనే పీకి పారేసింది. ఎటూ తాము అధికారంలో వచ్చేశాం కాబట్టి ఇంక దాంతో పనేముంది అన్నట్లు మూడు రోజుల క్రితం ఆ మేనిఫెస్టోను తీసేశారు. ప్రజలను చంద్రబాబు నాయుడు పదే పదే మోసం చేస్తున్నారని.. తాజాగా తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను కూడా వెబ్సైట్ నుంచి తీసేసిందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.