దేశం మార్కు... అతిక్రమణ!
సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన
రహదారుల మధ్యలో పైలాన్‌ల నిర్మాణం
సీఎం చంద్రబాబు కార్యక్రమానికి ప్రాధాన్యం
చిలకలూరిపేటలో అధికారుల అత్యుత్సాహం
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమాన్ని విజయవంతం చేసే ఆరాటంలో జిల్లా యంత్రాంగం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోవడం లేదు. ఈ నెల 18న చిలకలూరిపేట నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరుకానున్న సీఎంను మరింత సంతృప్తి పరిచేందుకు అనుమతులు లేని ఆర్భాటాలకు తెరతీశారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, పైలాన్‌ల నిర్మాణాలు చేపట్టకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి, హడావుడిగా నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో జరగనున్న ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’అనే రీతిలో ఇద్దరి ప్రశంసలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హడావుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులను కూడా సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తులుగా మార్చేస్తున్నారు.
వివరాలు ఇవి....
2012లో సుప్రీం తీర్పు .....రహదారులు, కూడలి ప్రాంతాల్లో విగ్రహాలు, ఇతర కట్టడాల నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని 2006 లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై రహదారులు, కూడలి ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. దీని ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్ని ప్రభుత్వశాఖలకు 2013 ఫిబ్రవరి 18న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదారులు, కూడలి ప్రాంతాలు, పేవ్‌మెంట్లకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేపట్టడానికి ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకూడదని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల్లోని అంశాలను జిల్లా స్థాయి అధికారులకు అందే విధంగా చేయడంతోపాటు వాటిని అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పుడిలా....
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గానికి ఈ నెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద నిర్మించనున్న గృహ సముదాయంతో పాటు రూ. 10 కోట్లతో టౌన్‌హాలు, రూ.11 కోట్లతో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ. 143 కోట్లతో అమృత పథకం కింద మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన, రూ. 4 కోట్లతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనచేస్తారు. రూ. 2 కోట్లతో నిర్మించిన అర్బన్ మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఇక్కడ మూడు పైలాన్‌లు నిర్మిస్తున్నారు. రహదారులు, ప్రధాన కూడలి ప్రాంతాల్లో వీటిని నిర్మించరాదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు. మూడు సెంటర్లలో అధికారులు భారీ ఎత్తున పైలాన్‌లను నిర్మిస్తున్నారు. నరసరావుపేట రోడ్డులోని ఎన్‌ఎస్‌పీ కెనాల్స్ కార్యాలయ ప్రాంగణంలో రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో ఒకటి, ఎన్‌ఆర్‌టీ సెంటర్ (అమృత్ పథకం తాలూకు)లో, పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్(స్వచ్ఛాంధ్ర పథకం తాలుకు)లో పైలాన్‌లు నిర్మిస్తున్నారు. ఈ మూడింటిలో రెండు పైలాన్‌లు జాతీయ రహదారుల మధ్యలోనే నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులనుఅధికారులుధిక్కరించారనేవిమర్శలుబాహాటంగావినపడుతున్నాయి.
ఆర్భాటపు పైలాన్‌లు ....
ప్రతి పనికి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటున్నప్పటికీ, అధికారులు ఆ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ మూడు పైలాన్‌ల నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానించకుండా ఒక్కోదానిపై రూ.10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. రూ.5 లక్షలకు మించిన పనులకు టెండర్లు ఆహ్వానించాలనే నిబంధన ఉన్నప్పటికీ, నామినేషన్ పద్ధతిపై పైలాన్ నిర్మాణాలను ఓ కాంట్రాక్టరుకు అప్పగించారు.