అర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో నిర్మించిన పైలాన్
సాక్షి, సింగరాయకొండ(ప్రకాశం): మండల తెలుగుదేశం పార్టీలో కందుకూరు రోడ్డు సెంటర్‌లో నడిరోడ్డులో నిర్మించిన పైలాన్ నిర్మాణం వివాదానికి ఆజ్యం పోసింది. మండలంలో రూర్బన్ పథకం కింద ఏడు గ్రామాల్లో సుమారు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా ప్రజలకు తాము చేసిన అభివృద్ధి తెలియజేసేందుకు నడిరోడ్డులో పైలాన్ నిర్మించారు. అయితే ఈ పైలాన్ నిర్మాణంతో తాము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేయటమే కాక రానున్న ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా పనికి వస్తుందని భావించారు. దీంతో ఆఘమేఘాల మీద ఆర్‌అండ్‌బీ స్థలంలో నడిరోడ్డులో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా పైలాన్‌ను నిర్మించారు.
అనుకొన్నదొకటి అయింది మరొకటి అన్న చందంగా పైలాన్ నిర్మాణం టీడీపీలో ముసలాన్ని రాజేసింది. ఈ పైలాన్‌లో జన్మభూమి కమిటీ సభ్యుల పేరుతో గ్రామంలోని టీడీపీ నాయకుల పేర్లు వేశారు. అయితే మండల పార్టీ అధ్యక్షుడు తన పేరు వేయకపోవడంతో తనను, తన వర్గాన్ని చిన్నచూపు చూస్తున్నారని వేల్పుల సింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారని, అంతేకాక పైలాన్ పైభాగంలో శ్రీ కృష్ణుని విగ్రహం ఏర్పాటు చేద్దామని కూడా మరో ప్రతిపాదన తెచ్చారన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రతిపాదనకు టీడీపీ నాయకులు తిరస్కరించటంతో పార్టీ రెండు వర్గాలుగా చీలిందన్న ప్రచారం సాగుతోంది. వేల్పుల సింగయ్యకు మండలంలో బలమైన వర్గం ఉంది. ఇతని పేరు పైలాన్‌పై వేయాలని మండలంలోని మూడు గ్రామాల నాయకులు మద్దతు తెలుపుతుండటంతో ఒక దశలో ఈ పైలాన్ తొలగించడానికి కూడా పథకం రచించారు.
అయితే తరువాత ఈ పైలాన్‌పై మండల పార్టీ అధ్యక్షుని పేరు వేయడానికి రాళ్లు సిద్ధం చేశామని, ప్రస్తుతం ఏర్పాటు చేసిన రాళ్లను తీసేసి కొత్త రాళ్లను వేసి పైలాన్‌ను మళ్లీ నిర్మిస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనకు సింగయ్య అంగీకరించలేదని ఆదివారం ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక ఈ పైలాన్ నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, కేవలం అధికార పార్టీ ఒత్తిడితో ఆ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద ఈ పైలాన్ నిర్మాణం టీడీపీలో ఎటువంటి వివాదాలను రాజేస్తుందోనని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment