
సాక్షి, అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పలు ఆరోపణలు చేసి బురద చల్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఇటీవల సమావేశమైన టీడీపీ శాసనసభాపక్షం ఇందు కోసం 22 అంశాలను సిద్ధం చేసింది. ఆ పార్టీ నాలెడ్జ్ సెంటర్ ఈ మేరకు వాటిపై నోట్ రూపొందించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందించింది. ఉల్లి ధరలు బాగా పెరగడంపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపి హడావుడి చేయాలని నిర్ణయించారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, తమ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఎక్కువ సేపు చర్చ జరిగేలా చేయాలని భావిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలను పెంచాలని నిర్ణయించడంతో దానిపై గొడవ చేయాలని నిర్ణయించారు. రాజధాని పర్యటనలో చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు, రాళ్లు విసిరిన ఘటనలనూ ప్రస్తావించాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో ఒక రకమైన వ్యూహం, శాసన మండలిలో మరో వ్యూహం అమలు చేయాలని నిర్ణయించారు. మండలిలో తమ సభ్యులే మెజారిటీగా ఉండడంతో అక్కడ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, అందుకు సిద్ధమవ్వాలని ఎమ్మెల్సీలకు చంద్రబాబు సూచించారు.
చర్చకు తేవాలనుకుంటున్న అంశాలు
ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, గ్రామ సచివాలయాల ఉద్యోగాలు, వలంటీర్ల నియామకాలు, ఉపాధి హామీ పథకం బిల్లుల పెండింగ్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, రాజధాని పనులు నిలిపివేయడం వంటి 22 అంశాలను లేవనెత్తాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.