నేలబారు రాజకీయం | AP ASSEMBLY SESSIONS 2020: Chandrababu Naidu One Day Suspended | Sakshi
Sakshi News home page

నేలబారు రాజకీయం

Published Tue, Dec 1 2020 5:31 AM | Last Updated on Tue, Dec 1 2020 11:41 AM

AP ASSEMBLY SESSIONS 2020: Chandrababu Naidu One Day Suspended - Sakshi

పోడియం ఎదుట బైఠాయించిన చంద్రబాబు

సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజైన సోమవారమే ప్రతిపక్ష నేత చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర తీశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేతననే ఇంగితం లేకుండా అధికార పక్ష మైనారిటీ ఎమ్మెల్యేపై వేలు చూపుతూ.. అసభ్యంగా దూషిస్తూ బెదిరించారు.. పూనకం వచ్చినట్లుగా ఉద్రేకంతో ఊగిపోయారు.. తమ పార్టీ సభ్యుడు మాట్లాడుతుండగా తానే అడ్డుకుని ఏకంగా పోడియంలోకి దూసుకెళ్లి బైఠాయించారు.

ప్రతిపక్ష నేత ఇలా పోడియంలో కూర్చోవడం ఏమాత్రం సమజసం కాదని, సంప్రదాయాలను కాలరాయడం మంచిది కాదని, నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని స్పీకర్, సభ్యులు పదేపదే విజ్ఞప్తి చేసినా వినకుండా అక్కడే బైఠాయించి నినాదాలు చేయడం ద్వారా సభను అడ్డుకునే కుట్ర పన్నారు. దీంతో చంద్రబాబుతో సహా టీడీపీ సభ్యులను సోమవారం ఒక్కరోజు సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించారు. అయితే విపక్ష సభ్యులు నిరసన కొనసాగించడంతో మార్షల్స్‌ ద్వారా వారిని బయటకు పంపారు. వ్యవసాయ రంగంపై చర్చ సందర్భంగా సభలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం: మంత్రి కన్నబాబు
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టం, ప్రభుత్వం ఆదుకున్న తీరు, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పంట నష్టం జరిగిన సీజన్‌లోనే పెట్టుబడి రాయితీ ఇవ్వటాన్ని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తన ప్రసంగంలో సమగ్రంగా వివరించారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ పంటల బీమా పథకాల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రైతు పక్షపాతినని నిరూపించుకుందని గణాంకాలతో తెలియచేశారు.

అనంతరం టీడీపీ సభ్యుడు రామానాయుడు మాట్లాడేందుకు స్పీకరు అవకాశం ఇవ్వగా పయ్యావుల కేశవ్‌ లేచి నించుని పంటల బీమా ప్రీమియం చెల్లించినట్లు ప్రకటించడం ద్వారా మంత్రి సభను తప్పుదోవ పట్టించారని, తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని అడ్డు తగిలారు. అయితే పయ్యావుల వ్యాఖ్యలను మంత్రి కన్నబాబు ఖండించారు. సీఎం కోసం సభను అరగంట ఆలస్యంగా ప్రారంభించారని, మంత్రి ప్రకటనలో బాధిత రైతులకు ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదని రామానాయుడు విమర్శలు చేయడాన్ని మంత్రి కన్నబాబు ఖండించారు.

చరిత్రాత్మక నిర్ణయం: సీఎం జగన్‌
నివర్‌ తుపాను వల్ల ఎంత నష్టం జరిగింది? రైతులకు ఎంత ఇస్తారో కూడా చెప్పలేదని రామానాయుడు మరోసారి వ్యాఖ్యలు చేయడంతో సీఎం జగన్‌ జోక్యం చేసుకుంటూ.. ‘మొన్ననే వర్షం వెలిసింది. ఆరు లక్షల హెక్టార్లలో పంట దెబ్బ తిన్నట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు మంత్రి ప్రకటించారు. డిసెంబరు 15లోగా ఎన్యూమరేషన్‌ పూర్తి చేసి 31వ తేదీకల్లా పెట్టుబడి రాయితీ చెల్లించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం...’ అని వివరించారు. ఇంతలో ప్రతిపక్ష నేత చంద్రబాబు లేచి మాట్లాడబోగా.. రామానాయుడు అడిగిన దానికి ఇప్పటికే వివరణ ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు మాట్లాడితే రెండు పక్షాల మధ్య వాదనలు, వివరణలతో సమయం సరిపోతుందని, ఇంకా బిల్లులు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. దీంతో స్పీకర్‌  అవకాశం ఇస్తే సీఎం డిక్టేట్‌ చేసి అవమానపరుస్తున్నారంటూ చంద్రబాబు వేలు తిప్పుతూ ఆగ్రహంతో ఊగిపోయారు.

రామానాయుడిని మాట్లాడాలని స్పీకరు సూచించగా చంద్రబాబు తన స్థానంలో నుంచి ముందుకు వచ్చి ప్రతిపక్ష నేతకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వరా? అవమానిస్తారా? అంటూ ఉద్రేకంతో ఊగిపోయారు. టీడీపీ సభ్యులంతా తమ స్థానాల్లోనుంచి లేచి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తమ స్థానాల నుంచి ముందుకు వచ్చిన అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు చేయి ఎత్తి చూపుతూ అసభ్య వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ సభ్యుడైన  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను వేలు చూపిస్తూ చంద్రబాబు బెదిరించారు. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంత చేసి కూడా తనను మాట్లాడనివ్వకుండా అవమానించారంటూ టీడీపీ సభ్యులతో కలిసి పోడియంలోకి దూసుకెళ్లి నేలపై బైఠాయించారు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు జరగకుండా అడ్డుతగిలారు. గందరగోళం సృష్టిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

వయసుకు తగ్గ మాటలేనా అవి?
విపక్ష సభ్యులు సాంప్రదాయాలను ఉల్లంఘిస్తూ.. సభా కార్యక్రమాలకు పదేపదే అవరోధం కల్పించడంపై సీఎం వైఎస్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన వయసును, అనుభవాన్ని మర్చిపోయి వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు. సభలో మాట్లాడేటప్పుడు కనీస అవగాహన ఉండాలని హితవు పలికారు. ‘విపక్ష సభ్యుడు ప్రస్తావించిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకసారి స్పష్టత ఇచ్చాక మళ్లీ అదే అంశంపై మాట్లాడటం సరికాదు. ఆయన (చంద్రబాబు) మైనారిటీ ఎమ్మెల్యేని బెదిరించి మళ్లీ ఏదో తనకు అన్యాయం జరిగినట్లుగా పోడియం ముందు కూర్చున్నారు.

ఎమ్మెల్యేలను ఉద్దేశించి తన వయసును కూడా మరిచి బాబు అసభ్యంగా మాట్లాడటం సరికాదు. అసెంబ్లీకి ప్రజాసమస్యలపై చర్చించడానికే వచ్చారా? ఇదేం పద్ధతి? బాబు వయసుకు తగ్గ మాటలా అవి? బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? కనీస ఇంగిత జ్ఞానం ఉందా?’ అని చంద్రబాబు తీరును సీఎం తప్పుబట్టారు. సభ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశాక చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. మెట్లపై కూర్చుని నిరసన తెలిపారు. బయట వరకూ ప్రదర్శన నిర్వహించారు. తొలిరోజు ఆయన ఎమ్మెల్యేలతో కలిసి ప్రదర్శనగా అసెంబ్లీకి వచ్చారు. వరి దుబ్బులు పట్టుకుని రైతులకు అన్యాయం జరుగుతోందని నిరసన తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement