వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి హత్యకేసులో 13 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.
అనంతపురం: వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్రెడ్డి హత్యకేసులో 13 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు. వారిలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. రాప్తాడు టీడీపీ ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ నేత శ్రీనివాసులు నిందితుల జాబితాలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బి. ప్రసాదరెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. ఓ పని నిమిత్తం రాప్తాడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఆయనను అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. కాగా ఈ హత్య పథకం ప్రకారమే జరిగిందని... ఈ హత్యలో టీడీపీ నాయకులు హస్తం ఉందని ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.