ఏపీలోనూ ఓట్లకు కోట్లు ఎర!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రలోభాలకు పాల్పడుతోంది. ఓట్లకు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో తగిన బలం లేకపోయినా టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఈ రెండు చోట్లా కచ్చితంగా గెలవాలని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించినట్టు సమాచారం.
ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 10 చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం నాటితో ముగిసింది. టీడీపీ 9, వైఎస్ఆర్ సీపీ ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకుంది. మరో రెండు స్థానాలకు మాత్రం పోటీ ఉండటంతో ఎన్నికలు అనివార్యంగా మారాయి. ప్రకాశం, కర్నూలు జిల్లాలలో జూలై 3న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు జిల్లాల్లో టీడీపీ గెలవడానికి బలం లేకపోయినా స్థానిక ప్రజాప్రతినిధులకు ఎర వేస్తోంది. డబ్బులు ఆశ చూపడం, వినని వారిపై కేసులు పెడతామంటూ బెదిరింపు చర్చలకు పాల్పడుతున్నారు. ఎలాగైనా మండలిలో బలం పెంచుకోవాలని చూస్తున్న చంద్రబాబు, ఇక్కడ కూడా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహా పాచికలు విసురుతున్నారని అంటున్నారు.