
2014 తర్వాత కాంగ్రెస్, టీడీపీ కనుమరుగు
గట్టు రామచంద్రరావు వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో సీబీఐ, చంద్రబాబు నాయుడు లాంటి కుట్రదారులపై ఆధారపడి ఎన్నికలకు పోతే ఫలితాలు ఇలాగే ఉంటాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. సీబీఐ, చంద్రబాబు లాంటి కుట్రదారుల మీద ఆధారపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక దేశంలో నూకలు చెల్లాయన్నారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే సోనియాగాంధీ ఇటలీ పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్, రాష్ట్రంలో చంద్రబాబు కనుమరుగవుతారని జోస్యం చెప్పారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు విలేకరులతో మాట్లాడారు.
పజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం కుట్రదారులను నమ్ముకోవడం వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషించారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వల్లే ఢిల్లీలో రెండు జాతీయ పార్టీలను కాదని ప్రాంతీయ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రజలు మద్దతు తెలిపారన్నారు. మన రాష్ట్రంలో కూడా నిత్యం ప్రజాసమస్యలపై పోరాటం చేసిన వైఎస్సార్‌సీపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమన్నారు. అధికార పార్టీకి బ్రాంచీ ఆఫీసులుగా మారిన చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు దూరం పెట్టనున్నట్లు ఇటీవల వెలువడిన సర్వేల్లో కూడా స్పష్టమైందని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఎంతసేపు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆడిపోసుకోవడం తప్పితే, ఆయన తొమ్మిదేళ్ల చీకటిపాలనను ప్రస్తావించే ధైర్యం లేదన్నారు. చనిపోయిన వైఎస్ పేరుతో పోరాడటానికి చంద్రబాబుకు జీవితకాలం సరిపోయేట్లులేదన్నారు. అవినీతికి బాబు చిరునామాగా మారినందువల్లే ప్రజలు లాగి కొడితే ఇప్పటికీ కోలుకోవడంలేదన్నారు. 2009 తర్వాత కూడా జరిగిన అన్ని ఉపఎన్నికల్లో ఏ ఒక్కటీ గెలుచుకోకపోగా, డిపాజిట్లు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు.