
విలేకరులతో మాట్లాడుతున్న జక్కంపూడి విజయలక్ష్మి
రాజానగరం : రానున్న ఎన్నికలే టీడీపీకి ఆఖరి ఎన్నికలు అవుతాయని, ఆ పై ఆ పార్టీని ఓటర్లు బంగాళాఖాతంలో కలిపేస్తారని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలకు మద్దతుగా నియోజకవర్గ కేంద్రమైన రాజానగరంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష శిబిరాన్ని ఆదివారం సందర్శించి, దీక్షాపరులకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లేనిపోని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, ఈ నాలుగేళ్లలో హామీలను తీర్చకపోగా, విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తన విదేశీ పర్యటనలు, విలాస భవనాలతో మరింత లోటులో పడవేశారని విమర్శించారు. కేంద్రం నుంచి లోటును భర్తీ చేసే విధంగా నిధులు తెచ్చుకోవడంలోనూ, పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాను సాధించుటలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. అటువంటి వ్యక్తి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలనూ గెలుచుకుని ఢిల్లీలో చక్రం తిప్పేస్తామంటూ పగటి కలలు కంటున్నారన్నారు.
కొంగ జపాలు ఎవరి కోసం
గట్టు మీద ఉండి చెరువులో చేపల కోసం జపం చేసే కొంగల మాదిరిగానే చంద్రబాబు దీక్షను భావించవలసి వస్తుందన్నారు. నిన్న ప్రధాన మంత్రి దీక్ష చేస్తే, 20న చంద్రబాబు దీక్ష చేస్తానంటుంటే ఇటువంటి అసమర్థులనా మనం పాలకులుగా ఎన్నుకుంది అని ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. నీవు దొంగంటే నీవే దొంగంటూ ఇద్దరు దొందూ దొందే కాబట్టే ఇటువంటి నిర్ణయాలను తీసుకుంటున్నారన్నారు. ఇటువంటి కొంగ జపాలు ఎవరి కోసమని ప్రశ్నించారు.
బంద్‌ని విజయవంతం చేయండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతూ సోమవారం జరుపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు విజయలక్ష్మి పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతుతో చేపట్టిన ఈ బంద్‌లో అధికార పార్టీ కూడా కలిసి ప్రత్యేక హోదా పోరులో ప్రజలకు బాసటగా నిలవాలని సూచించారు. ప్రత్యేక హోదా రాకూడదునుకునే వారే బంద్‌కి దూరంగా ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment