మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను టీడీపీలో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు.
విశాఖపట్నం: మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను టీడీపీలో చేర్చుకోవద్దంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారు. కొణతాలకు వ్యతిరేకంగా అనకాపల్లిలో నెహ్రు చౌక్ లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కొణతాల దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దహనం చేశారు.
కొణతాల రామకృష్ణతో పాటు ఆయన అనుచరులను టీడీపీలో చేర్చుకోవద్దంటూ అనకాపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు ఇంతకుముందు డిమాండ్ చేశారు. ఇటీవల వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చిన కొణతాల ఆయన అనుచరగణం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కొణతాల అనుచరులు తమను వేధించారని, ఇప్పుడు వారంతా టీడీపీలో చేరితే ఎలా కలిసిపనిచేయగలమని ప్రశ్నించారు.