సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వ పాఠశాలలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఏకంగా బోధనే నిలిచిపోయింది. అవసరమైన మేర ఉపాధ్యాయులను నియమించకపోవడం, విద్యా వలంటీర్ల నియామకాలను ఈ మారు పునరుద్ధరించకపోవడంతో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యాంశాల బోధన అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని 28 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో అసలు ఉపాధ్యాయులే లేరు. మరో 35 పాఠశాలల్లో కేవలం ఒక్కో టీచరు మాత్రమే కొనసాగుతున్నారు. గత వారం జిల్లా రాజీవ్ విద్యామిషన్ చేపట్టిన పరిశీలనలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి.
175 మందికి ఒక టీచర్..
జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే జిల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు ఇటీవల పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సంఖ్యపై ఓ సర్వే చేపట్టారు. ఇందులో 119 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఎంచుకుని ఈ పరిశీలన చేపట్టారు. ఈ 119 పాఠశాలల్లో మొత్తం 12,313 మంది విద్యార్థులున్నారు. ఈ పాఠశాలలకు మొత్తం 151 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా, కేవలం 70 మంది టీచర్లు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే టీచర్ల కొరత ఉన్న పాఠశాలల్లో గతేడాది వలంటీర్లను నియమించినప్పటికీ.. ఈ ఏడాది వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం విద్యార్థులు పాలిటశాపంగా మారింది.
2012-13 విద్యాసంవత్సరంలో జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మూడున్నర వేల మంది విద్యావలంటీర్లను నియమించారు. గత విద్యాసంవత్సరం చివరి నాటితో వీరి నియామకం రద్దయింది. మళ్లీ కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంతో వలంటీర్ల నియామకం చేపడతారని భావించినప్పటికీ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు కొత్తగా డీఎస్సీ నిర్వహించకపోవడంతో జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీల కొరతకు పరిష్కారం దొరకలేదు. ఉపాధ్యాయ ఖాళీలతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ముందుకు సాగకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఇప్పటికీ పలు పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టుల బోధన ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుంటే విద్యార్థుల భవిష్యత్ మరింత ఆందోళనకరంగా మారనుంది.
జిల్లాలోని 28ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో టీచర్లు లేని దుస్థితి
Published Mon, Sep 2 2013 12:46 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement